నటుడు - గొల్లపూడి మారుతీరావు గారు

గొల్లపూడి మారుతీరావు

(ఏప్రిల్ 14, 1939 - డిసెంబరు 12, 2019)


 రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు.

సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

బాల్యం, విద్యాభ్యాసం

గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్సు ), విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణం లోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్‌సీ (ఆనర్స్) చేశారు. ఈయన అన్నపూర్ణ, సుబ్బారావుకి అయిదో కొడుకు.

ఉద్యోగం

మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లారు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు.

రచనా ప్రస్థానం

మారుతీరావు గారు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954, డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించారు.

విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచన అనంతం, ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నారు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించారు. ఆ అసోసియేషనుకు వి.వి.గిరి అధ్యక్షులు. చైనా ఆక్రమణ పై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరి లలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు.

చైనా విప్లవం పై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందే మాతరంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావుగారు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959, డిసెంబరు 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఎదుట ప్రదర్శించబడింది. అంతేకాకుండా పథర్ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించబడింది.


 పరిశోధన

ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.

కుటుంబం

మారుతీరావు గారి వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయులు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు. మారుతీరావు గారికి ముగ్గురు మగసంతానం సుబ్బారావు, రామకృష్ణ మరియు శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన కుటుంబంతో మద్రాసులో నివసిస్తున్నారు.

గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారం

1992 ఆగస్టు 12న మారుతీరావు గారి చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్, తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించారు. మారుతీరావు గారు తన కుమారుని జ్ఞాపకంగా, గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ప్రతి యేటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రధానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదేని అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15, 000 గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహూకరిస్తారు. సునీల్ దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, జావెద్ అక్తర్, అనుపమ్ ఖేర్ మొదలైన వారు ఇందులో ప్రసంగించిన వారిలో ప్రముఖులు. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణలు మారుతీ ఎయిర్‌లింక్స్ అనే ట్రావెల్ ఏజన్సీని నడుపుతున్నారు.

సినిమా ప్రస్థానం

ఈయన 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావు గారికి అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 ఆయన నటించిన కొన్ని సినిమాలు. పూర్తి జాబితా కోసం ఆధికారిక వెబ్‌సైటును సందర్శించండి.

అవార్డులు

మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

నంది అవార్డులు

1963 లో డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా
1965 లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా
1989 లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దానికి ఉత్తమ రచయితగా
1991 లో మాస్టారి కాపురం సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా
ఇతర పురస్కారాలు సవరించు
2002లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కించుకున్నారు.
1975లో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం. ఈ నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం కింద అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇదే నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు సాహిత్యం వారికి పాఠ్యపుస్తకంగా ప్రతిపాదించారు.
ఉత్తమ హాస్యరచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి సర్వరాయ మెమోరియల్ బంగారు పతకం
2002 లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పైడి లక్ష్మయ్య ధర్మనిధి పురస్కారం
1985లో వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచి ఉత్తమ నాటక రచనకు గాను గురజాడ అప్పారావు మెమోరియల్ బంగారు పతకం
1959 లో ఆకాశవాణి నిర్వహించిన, ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు గాను బహుమతి
ప్రశ్న అనే నాటకానికి అఖిల భారత స్థాయిలో మహాత్మా గాంధీ సృజనాత్మక సాహిత్య పురస్కారం
1984లో ఉత్తమ నాటక రచనకు గాను వంశీ బర్కిలీ పురస్కారం
1983 లో తరంగిణి సినిమాలో ఉత్తమ హాస్యనటుడి పురస్కారం
1985లో రామాయణంలో భాగవతం సినిమాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ఉత్తమ సహాయనటుడి పురస్కారం
1987లో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంపిక.
2015లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం[2]

ఇవే కాక 2009 లో గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య, అలనాటి ప్రముఖ రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి పేరు మీదుగా నెలకొల్పిన అవార్డును, మారుతీరావుకు ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో పొలమూరుకు చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని అందుకున్నారు.
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.

బుల్లితెర

ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతిధ్వని కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ఈటీవీ నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇది భార్యాభర్తల కోసం ఉద్దేశించింది. జెమిని టీవీ నిర్వహించిన ప్రజావేదిక, మాటీవీ నిర్వహించిన వేదిక, దూరదర్శన్, హైదరాబాద్ ప్రసారం చేసిన సినీ సౌరభాలు మొదలైనవి ఆయన నిర్వహించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు. ఇంకా ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు-పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రుః, ఏది నిజం? అనే ధారావాహికల్లో నటించారు.

సన్మానాలు

1994 లో బెంగుళూరుకు చెందిన మేలు కలయిక
1996లో విజయనగరానికి చెందిన విజయ భావన
2004 లో ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్, ఖరగ్‌పూర్ వారి నుంచి సన్మానం
2005లో విపంచి తెలుగు అసోసియేషన్, షార్జా వారి సన్మానం
2005లో రసమయి, దుబాయ్ వారిచే సన్మానం

పదవులు

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశారు. 1958లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు. 1978లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరపున సమీక్షకుడిగా వ్యవహరించారు. 1996 లో జరిగిన ఇండియన్ పనోరమాలో జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించారు. 2000, డిసెంబరు 8 న జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు, సంస్కృతి మీద సెమినార్ కు అధ్యక్షత వహించారు. 2007, జూన్ 2, 3 తేదీల్లో చెన్నైలో జరిగిన అఖిల భారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. 2007, సెప్టెంబరు 23 న కృష్ణా జిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలకోపన్యాసకుడుగా వ్యవహరించారు.

మరణం

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారుతిరావు గారు చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెంబరు 12న మరణించారు. వారి నటనాత్మకు నివాళీలర్పిస్తూ...

3 కామెంట్‌లు:

  1. చాలాచోట్ల "నటించాడు" అని ఏకవచన సంబోధన మర్యాదగా అనిపించలేదు.

    రిప్లయితొలగించండి
  2. మీ సూచన మరియు సవరణకు కృతజ్ఞనుడ్ని. కొన్నిచోట్ల తప్పుగా వచ్చినది... నా వంతు సరిచేస్తాను...ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  3. చిన్న మార్పు జరిగింది. సరి చేసేందుకు సమయం పట్టింది.

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.