శబ్ద పల్లవములు - సంక్షిప్త వ్యాఖ్యానము

శబ్ద పల్లవములు - సంక్షిప్త వ్యాఖ్యానము


ధాతువు మొదలైన వాటికి ధాతువులు అనుప్రయుక్తంబులగునపుడు (వెంట ప్రయోగంప బడినపుడు)ఆ యా శబ్దముల కంటె విలక్షణమైన అర్థము బోధింపబడినపుడు ఆ పద బంధములకు శబ్దపల్లవములు అని పేరు.

అంటే ధాతువు లేదా ప్రాతిపదికకు ధాత్వీకరణ ప్రత్యయం చేరినపుడు ఏర్పడే విలక్షణార్థం గల ధాతువులనే శబ్ద పల్లవాలు అంటారు.



  శబ్ద పల్లవములోరెండు  అవయవాలు ఉంటాయి. మొదటిది ధాతువు కాని మరొకటి కాని కావచ్చును. రెండవ అవయవం తప్పనిసరిగ ధాతువు అయి ఉండాలి. ఇప్పుడు ఈ రెండు అవయవాలు కలిసి మరో ధాతువుగ మారినపుడు ఆ క్రొత్త ధాతువుకు దానిలోని అవయవ శబ్దముల అర్థం కంటే వేరయిన అర్థం వస్తే దానిని శబ్ద పల్లవము అంటారు. 

పల్లవము అనగా చిగురు. రెండు దళములు ఏకీభవించి చిగురుగా రూపు దిద్దుకొన్నట్లు రెండు శబ్దములు కలిసి మరి యొక శబ్దముగ మారినచో అది శబ్ద పల్లవము అనబడును. వీటినే జంట శబ్ద క్రియలు అంటారు.

కూరుచు + ఉండు = కూరుచుండు

ఇక్కడ కూరుచు (కూర్చు) అనే ధాతువుకు ఉండు అనే మరో ధాతువు అనుప్రయుక్తమయినప్పుడు ఆసీనమగు (కూర్చొను) అనే విలక్షణమైన అర్థం వచ్చింది. కనుక కూరుచుండు అనే క్రొత్త ధాతువు శబ్ద పల్లవం అవుతుంది.


ఇట్లే విజయం (గెలుపు) అనే అధాతువుకు (ధాతువు కాని దానికి) చేయు అనే క్రియ కలిసినప్పుడు ఆ రెండు పదాల సముదాయంకు “వచ్చు” అను విలక్షణమైన అర్థం వచ్చింది. కనుక విజయం చేయు అనే క్రొత్త ధాతువు శబ్ద పల్లవం అవుతుంది.


నిర్వచనాలు:
ధాత్వాదులకు ధాతువులనుప్రయుక్తంబులయి విలక్షణార్థాభిదాయకంబులగునీయవి శబ్ద పల్లవంబులు నాఁబడు ( బాల వ్యాక. క్రియా. 118వ సూత్రం)

ధాతు నామావ్యయముల తుద జేరి కొన్ని అర్థాంతరములను దెలుపును. అవియే శబ్ద పల్లవములనబడును ( ఆంధ్ర భాషానుశాసనం క్రియా ప్రకరణం 42వ సూత్రం)

ప్రథమా ద్వితీయాన్యతర విభక్త్యంతములగు నామ పదంబులకు ధాతువులనుప్రయుక్తంబు లయి విలక్షణార్థాభిదాయకంబులగునవి శబ్ద పల్లవంబులు నాఁబడు (ముక్త లక్షణ కౌముది క్రియా పరిచ్ఛేదము 52వ సూత్రము)

క్రియా ప్రసిద్ధా బహవ
శ్శబ్ద పల్లవ సంజ్ఞికాః |
ప్రథమాయా ద్వితీయాయా
స్సమ్బన్ధస్తత్ర సమ్మతః || (వికృత వివేక కారిక - అహోబలపండితీయము 268 సూ.4)

1. నామ ప్రాతిపదిక + ధాతువు

తేట + పడు = తేటపడు ( విశదమగు)
మేలు + కొను = మేలుకొను
గుండె + పగులు = గుండె పగులు (బాధకలుగు)
కాపు + ఆడు = కాపాడు
నోరు + ఊరు = నోరూరు
ఆకలి + కొను = ఆకొను

2. ధాతువు + ధాతువు

ఏగు + తెంచు = ఏగుదెంచు
కూరుచు + ఉండు = కూర్చుండు, కూరుచుండు

మరి కొన్ని విశేషాలు

శబ్ద పల్లవ క్రియలు కొన్ని ద్విరుక్తంబులగుచో నుత్తర పదంబు పూర్వావయంబునకు లోపంబు విభాషనగు (ప్రౌఢ వ్యాకరణం క్రియా 24)

రెండు సార్లు చెప్పబడినప్పుడు శబ్ద పల్లవ క్రియల యొక్క పర రూపము యొక్క పూర్వ భాగమునకు లోపము విభాషగా వస్తుంది.

(నడచు + ఆడి) + (నడచు + ఆడి)
నడయాడి + నడయాడి = నడయాడి యాడి

శబ్ద పల్లవ క్రియలు నైక్యమున చెప్పబడి మరలా గ్రహించబడితే వాటి పూర్వావయవములకు లోపము విభాషగా వస్తుంది (చూడు ప్రౌఢ వ్యాక. క్రియా 25)

ఉదాహరణ: చనుదెమ్ము అని వాక్యము సమాప్తమై మరల దానిని గ్రహింపవలెనన చనుదేన్, చనుదేరన్ అనవలెను. అయితే పూర్వావయవమునకు లోపము వచ్చి నపుడు తేన్, తేరన్ అవుతాయి.


శబ్ద పల్లవముల చివర ఉన్న పడు ధాతువునకు ఇంచుక్ అనే ఆగమము పరముగ వచ్చినప్పుడు పడు ధాతువు లోని డకారపు పొల్లు స్థానమున లఘు రేఫము (ర్) ఆదేశముగ వచ్చును. (చూడుము బాల వ్యాక. క్రియా. సూత్రము 83).

వెలువడు + ఇంచు = వెలువరించు
చెప్పడు + ఇంచు = చొప్పరించు

శబ్ద పల్లవము లోని మొదటి అవయవము క్రియ ఉండవచ్చునని బాల వ్యాకరణ కారుడు, ప్రౌఢ వ్యాకరణ కారుడు చెప్పారు కాని అది సుబంతము (నామవాచకము) కావలెనన్నది అహోబల సూరి మతము. ఆ వివరాలు ఇక్కడ అప్రస్తుతము.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.