మహాకవి శ్రీశ్రీ(శ్రీ రంగం శ్రీనివాసా రావు) / maha kavi sri sri/ srirangam srinivasarao

*మహాకవి శ్రీశ్రీ(శ్రీ రంగం శ్రీనివాసా రావు)*


             శ్రీశ్రీ ఈ రెండు అక్షరాల గురించి సాహిత్య లోకం గురించి కొత్త గా పరిచయం చేయనక్కరలేదు. *ఏ కవి యొక్క ఆవిర్భావం వల్ల ఈ సాహితీ ప్రపంచం ఇంకో అడుగు ముందుకు వేసిందో అలాంటి మహాకవే శ్రీశ్రీ*.  మరో వందేళ్ల దాకా అయినా సరే శ్రీశ్రీ గురించి మాట్లాడ వచ్చు......


                       శ్రీశ్రీ గారి  తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. కానీ శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన వీరి ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. *1925 లో వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు.* రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. 

                           శ్రీశ్రీ దీ మౌలికంగా ఒక విప్లవ తత్వం.అందువల్ల పాతకాలం మీద యుద్దాన్ని ప్రకటించాడు. నూతన రీతులను అభిమానించాడు. పాశ్చాత్య రీతులను ప్రేమించాడు. *ప్రాయిఢ్ ను చదివి అర్దం చేసుకోవడంకు చేతన్య స్రవంతి అలవడడంకు కారణం విశాఖపట్టణం పిచ్చాసుపత్రి అంటాడు శ్రీశ్రీ*.  


విశ్వనాథ రాళ్లపల్లి వంటివారు విమర్శ లో స్వతంత్ర్య ప్రతిపత్తి ని కలిపిస్తే శ్రీశ్రీ మాత్రం సామాజిక భూమికకు ప్రాధాన్యత ఇచ్చారు. *శ్రీశ్రీ కీ కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అంటే చాలా ఇష్టం. అందుకే అంటారు శ్రీశ్రీ  A work of art can never be repeated మరో తాజ్ మహల్ కట్టడం కానీ మళ్లీ శకుంతలం రాయడం గానీ అసంభవం*. శ్రీశ్రీ శకుంతలం ను దృష్టిలో పెట్టుకొని ఒక డిటెక్టివ్ నవల రాసి తన ముచ్చట తీర్చుకున్నాడు. 



శ్రీశ్రీ రచనలు:-


*కవిత్వం*

* ప్రభవ (1928)

* మహాప్రస్థానం (1950)  

* వరం వరం (1946)

* సంపంగి తోట (1947)

* మరో ప్రపంచం (1954)

* ఖడ్గసృష్టి (1966-84)

* సౌదామిని (పురిపండా గేయాలకు ఆంగ్లానువాదం) (1958)

* మరోప్రస్థానం (1980)

* మూడు యాభైలు (కార్టన్ కవితలు)


*నవలలు*

* చిత్ర రహస్యం (అనువాద అపరాధక నవల)

* పరిణయ రహస్యం

* గోకులాయి (డిటెక్టివ్ నవల)


*యాత్ర చరిత్ర*

* చైనా యానం


*విమర్శ గ్రంధం*

* ముత్యాల సరం (గురజాడ ముత్యాల సరం పై)


*పాటల సంకలనం*

* పాడవోయి భారతీయుడా (1983)

* తెలుగు వీర లేవరా (1996)


*శతకం*

* సిరి సిరి మువ్వ


*ఆత్మ కథ*

* అనంతం (1986))



*నాటికలు*

* అమ్మ

* సంపెంగ తోట

* భాగ్యలక్ష్మీ

* భూతల కొలిమి

* శిరస్సు చెప్పిన రహస్యం

* విదూషకుడి ఆత్మహత్య

* దడిగాడు నసిరా (సినీ నిర్మాతల పై)

* చతురస్రం

* కోక్కోరోకో

* సుప్తాస్థికలు

*కథలు*

* కోనేటి రాయలు కథలు

* హేమంత కథలు

* ఆశ్వమేధ యాగం కథలు

* చరమ రాత్రి (1957)

* ఆనంద మందిరం

* కవి సన్మానం

* స్వర్గం



*ఇతరములు*

* అమ్మ  (1952)

* మేమే (1954)

* రేడియో నాటికలు (1956)

* త్రీ చీర్స్ ఫర్ మాన్ 

* మానవుడి పాట్లు (1958)

* గురజాడ (1959)

* 1 + 1 = 1 (రేడియో నాటికలు)- (1964-87)

* మాస్కో (1971)

* రెక్క విప్పిన రివల్యూషన్ (1971)

* ప్రాస క్రీడలు (1980)

* మరో మూడు యాభైలు (1974)

* సిప్రాలి 

* శ్రీ శ్రీ వ్యాసాలు (1986)

* New Frontiers (1986)

* ప్రజ (ప్రశ్నలు జవాబులు) 1990

* విశాలాంధ్రలో ప్రజారాజ్యం (1999)

* ఉక్కు పిడికిలి

* అగ్నిజ్వాల (2001)

* ఖబర్దార్ సంఘ శత్రువు లారా  (2001)

* సావిత్రి సత్య వంతుడు (పద్యనాటకం)

* మారు మోతలు

* వారం వారం

* ఆంధ్ర కవితా పితామహుడు

* వీర సింహ విజయసింహ (1920)

* విద్యునాల్మికలు (1933-మొదటి వచన గేయం)

* దివ్య లోకములు (1925)

* స్వకీయ పురాణం (గీత మాలిక)

* సద సత్సంశయం

* రెక్క విప్పిన రెవల్యూషన్


    వీరి రచనల విషయం కీ వస్తే *కోనేటి రావు కథలలో శ్రీశ్రీ చేతన్యస్రవంతి విధానంను తెలుగు వారికి పరిచయం చేసాడు*. ఒసేయ్ తువ్వాలందుకో ; అశ్వమేధం కథలలో మనిషి మనస్తత్వంలో వున్న చీకటి కోణాలను ఆవిష్కరించారు శ్రీశ్రీ. వీరి కీ బాగా పేరు తెచ్చిన రచన *మహా ప్రస్థానం దీనిని డా. సూర్య నారయణ భాను గారు హిందీ లోకి అనువదించారు*. అలాగే డా.వి. రామ కృష్ణ గారు కూడా శ్రీశ్రీ కొన్నీ గేయాలను హిందీలోకి అనువదించారు. 


కానీ *గురు ప్రసాద్ రావు నాగేళ్ళ వంటి విమర్శకుల ప్రకారం మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ ఏ కవితా రచనలలో ఊపు లేదన్నారు*. ప్రాస క్రీడలలో జాతీయ నాయకుల వైఖరి ని ఖండించాడు. ఖడ్గసృష్టిలో రౌడీ రాజకీయాలను విమర్శించారు. 1938 లో చనిపోయిన పెరు విప్లవ యోధుడు పల్లేజ్ (పెరు) గురించి ఎక్కడా సత్యం (1971) ను అనువాదం చేసాడు. 1959 లో కేరళలో ప్రభుత్వము రద్దు చేసినప్పుడు ; 1968 లో ప్రాన్స్ లో తిరుగుబాటు పై రెక్క విప్పిన రెవల్యూషన్ పేరు తో పోరాటగాథ ను అనువాదం చేసాడు.

*సాహిత్యంలో శ్రీశ్రీ భావనలు*

* శ్రీశ్రీ  కవిత్వంను శుద్దకవిత్వమనీ ఉపయోగ్య కవిత్వమనీ*"రెండు రకాలుగా విభజన చేసారు.

* శ్రీశ్రీ దృష్టి లో  వసంత సేన కంటే కన్యాశుల్కం మధురవాణి పాత్ర యే  గొప్ప సృష్టి.

* కన్యాశుల్కం వస్తుప్రధాన రచనే తప్ప రసప్రధానం కాదు అనీ చాలా మంది విమర్శకుల అభిప్రాయం. కానీ శ్రీశ్రీ మాత్రం *కన్యాశుల్కం భీబత్స ప్రధానమైన విషాదాంత నాటకం* అనీ అన్నారు.

* విశ్వనాథ రాళ్లపల్లి వంటివారు విమర్శ లో స్వతంత్ర్య ప్రతిపత్తి ని కలిపిస్తే శ్రీశ్రీ మాత్రం సామాజిక భూమికకు ప్రాధాన్యత* ఇచ్చారు.

* ఒకే వ్యక్తి లో ఒకే సందర్భంలో  రెండు రసాలు ఉండడం గురించి చెబుతూ ఆరు సారా కథలు అనే రచన ముందు మాటలో *రసన అనే ఒక సిద్దాంతం* ను ప్రతిపాదించారు.

* శ్రీశ్రీ *నన్నయ్య ను లిరికల్ పోయేట్* అనీ ప్రతిపాదించాడు.

* శివరాత్రి మాహాత్మ్యం తనను *ఇన్స్పిరేషన్ చేసిన రచన* అన్నాడు.

* శ్రీనాధుని కవిత్వాన్ని జీర్ణించుకున్న *అల్లసాని పెద్దనను మహాకవి* గా గుర్తించాలన్నాడు.

* గురజాడ ఆధునిక యుగానికీ మహాకవి అంటూనే   ఆధునిక కవిత్వ మూలాలు చెళ్ళపిళ్ళ కవుల శతావధానలలో కనిపిస్తాయంటారు 
 శ్రీశ్రీ.

* గుంటూరు శేషేంద్ర శర్మ గారి పాండిత్యాన్ని మెచ్చుకుంటూనే *గోడ మీద కోకిల* అంటూ ఎత్తిపొడిచాడు.

*శ్రీశ్రీ పై వచ్చిన పరిశోధనలలో కొన్నీ*

* శ్రీశ్రీ కవిత్వం - వస్తు సంవిధానం (1978 - AU) - మిరియాల రామకృష్ణ

* శ్రీశ్రీ కవిత్వం మనో విశ్లేషణత్మక పరిశీలన (1981-OU) - డి.కృష్ణమరాజు

* శ్రీశ్రీ పీఠికలు (1989- OU) - ఆర్.సుదర్శన్

* విమర్శకుడిగా శ్రీశ్రీ (1991-Hcu) -  దైవాశీర్వాదం
*  సాహిత్య వ్యాసకర్త గా శ్రీశ్రీ (1977-OU) - S.N.సత్య నారయణ  శాస్త్రి

* శ్రీశ్రీ వచనాలు కళా తత్వశాస్త్ర ధృక్పధం (1993-Hcu) - డి.నరేష్ బాబు

* మహాప్రస్థానం - పరిశీలన (1978-అనంతపురం) - ఎమ్.పద్మావతి

* మహాప్రస్థానంలో పురాణ ప్రతీకలు  (1984) - కె.విజయలక్ష్మీ



                   తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి శ్రీశ్రీ మాటలు పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం "నీరా ఔర్ నందా"కి ఈ సినిమా తెలుగు అనువాదం. *శ్రీశ్రీ నే స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమా తీసాడు*. కానీ అది  విజయవంతం కాలేదు.అయినా సరే మళ్లీ శ్రీశ్రీ  ఉషశ్రీ పిక్చర్ అనే  సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు కాని అది సఫలం కాలేదు. *శ్రీ శ్రీ సుమారు సంవత్సరం పాటు కలం స్నేహం గా సన్నిహితురాలైన కమల అనే ఆమెను తన భార్య అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు*. కానీ కుదరలేదు. అయితే తానేంత మంది స్త్రీలను కాంక్షించినా సరోజ (2-భార్య) అంటేనే ఇష్టమనీ చెప్పుకోచ్చాడు.  



శ్రీశ్రీ ఆధునిక కవులలో వివాదాస్పదుడు మరియు వ్యక్తిగతం గా ఆస్థిరత్వం తో మెలిగేవాడనీ తీవ్ర విమర్శలు కలవు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి ఆయన అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, *మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం*, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు ఆయన జీవితాన్ని తాకాయి. ఆయన గురించి జీవితచరిత్రకారుడు [బూదరాజు రాధాకృష్ణ] శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అనీ తన అభిప్రాయం చెప్పారు. 




అంతే కాదు ఇంకా చెబుతూ కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. *మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు*. వాస్తవజీవితంలో *అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు* అంటూ స్వభావాన్ని గురించి బూదరాజు వ్యాఖ్యానించారు. *శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు*. పైగా ఆయన రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసాయి .కానీ శ్రీశ్రీ ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు. వ్యక్తిగత జీవితం ఎలా వున్నా రచనలలో అభ్యుదయ పంధాని అనుసరించారు.


                 
ఇంతటి మహాకవి కీ వ్యక్తిగతవిమర్శలు పక్కకు పెడితే కవిత్వం పరంగా కూడా ఎన్నో విమర్శ లు ఎదుర్కొన్నారు. అదీ కూడా కవితా భాషలోనే

*శ్రీశ్రీ పై వచ్చిన కొన్నీ కవితలు*

* ఉద్యమ నాయక చదువుకో (1979) - ఆరుద్ర
( *ఏటికేడాది కవితా సంకలనం* లో ఆరుద్ర గారు శ్రీశ్రీ ని *మహా ప్రస్థాన మార్గం విడిచి వెక్కిరింతలతో కాలక్షేపం చేస్తున్నాడనీ* హెచ్చరిక కవిత రాసారు)
* ధర్మ సంస్థాపనార్దయ (1958) - చేరా
( శ్రీశ్రీ *సిన్మా రచయిత గా మారి కవిత్వం ను నిర్లక్ష్యం చేస్తున్నాడనీ* చేరా రాసిన కవిత)
* మహా కవికీ ఏకలవ్యుని కీ  బహిరంగ లేఖ (1966) - సి.వి.కృష్ణరావు
( *కారు చీకట్లో కాంతి రేఖ*)
* శ్రీశ్రీ జ్ఞాపకాలు (1983) - శివసాగర్ 
(ఉద్యమం నెలబాలుడులో )
* పెద్ద పెద్ద కబుర్లు - రంధి సోమరాజు
( *ఎద గండి కవితా సంపుటి* లో శ్రీశ్రీ కవిగా గొప్పవాడయిపోయి సామాన్యులను మరిచిపోయాడనీ ఆవేదన చెందాడు)
* భువన ఘోష - కె.వి.ఆర్
* అరవై ఏళ్ల శ్రీశ్రీ కోసం - వెల్చేరు నారయణ రావు

                 ఇక శ్రీశ్రీ పై విమర్శలకు లెక్కే లేదు. ముఖ్యంగా శ్రీశ్రీ ని *మగవాద మహాకవి* అన్నారు. ఇంకా శ్రీశ్రీ  *స్త్రీ వాదుల కోసం ; దళితుల కోసం ఆయన రాసిందేమీ లేదనీ ; మైనారిటీ లను కించపరిచాడనీ* ;  యావత్ ప్రపంచం కీర్తించిన తెలంగాణ రైతాంగ పోరాటం పై ; *తెలంగాణ కోసం కనీసం ఒక్క చిన్న గీతం రాయలేదనీ* ; ఎక్కడో బెంగాల్ పోరాటం పై ; చైనా పై ;  రష్యాలలో మనుష్యుల పై రాసాడు గానీ ఇక్కడ కళ్ల ముందు జరుగుతున్న ప్రాంతీయ తెలంగాణ పోరాటం పై వివక్ష చూపాడనీ శ్రీశ్రీ పై తీవ్ర విమర్శలు కలవు. తోటి కవులు *తెలంగాణ పోరాటాన్ని కావ్యాలుగా నవలలు గా నాటకాలు గా కవిత్వం గా రాస్తున్న సరే శ్రీశ్రీ మాత్రం తెలంగాణ పై పక్షపాత బుద్ది చూపారు*. శ్రీశ్రీ కీ అంతర్జాతీయ దృష్టి తప్ప ప్రాంతీయ తత్వం లేదనీ సరి పెట్టుకోవాలిసివచ్చింది. ఏదీ ఏమైన ఆధునిక సాహిత్య లో శ్రీశ్రీ ప్రస్తావన లేదంటే అదీ అసంపూర్తి అన్నట్లే............

మరింత సమాచారం కొరకు కింద లంకెను  చూడండి....
                    

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.