అలంకారాలు / Alamkaaraalu

  అలంకారాలు 


> కావ్య సరస్వతికి శోభను చేకూర్చేవి అలంకారాలు.

> ‘అలం’ శబ్దానికి ‘కృ’ ధాతువు చేరి ‘అలంకారం’ అనే రూపం సిద్ధించింది.

> అలంకారమంటే భూషణం అని అర్థం.

> ఇవి కావ్య సౌందర్యాన్ని పెంపొందించి, శోభను కలిగిస్తాయి.

> అలంకారాలు రెండు రకాలుగా విభజించారు.
1.శబ్దాలంకారాలు,
2.అర్థాలంకారాలు.


1) శబ్దాలంకారాలు:-


శబ్దమువల్ల కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు.

సంగీతానుగుణ్యమైన శ్రవణ ఫేయతతో పాఠకులకు ఆహ్లాదం కలిగించేవి శబ్దాలంకారాలు.


ఇవి ఆరు రకాలు. అవి

1. వృత్త్యనుప్రాసం

2. ఛేకానుప్రాసం

3. లాటాను ప్రాసం

4. యమకం

5. ముక్తపదగ్రస్థం

6. అంత్యానుప్రాసం


1.వృత్త్యనుప్రాసం:-

ఒకటి లేదా రెండు మూడు హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది అది వృత్త్యనుప్రాసం.

ఉదా:

 ‘హరిహరి సిరియురమున గలహరి’
ఇందులో ‘ర’ కారం పునరుక్తమై ఆహ్లాదం కలిగిస్తోంది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసం.

ఉదా:

చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్. క పునరుక్తము అవుచున్నది.

ఉదా:

గడన గల మగని జూసిన,
అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో,
గడనుడిగిన మగని జూసిన
నడుపీనుగ వచ్చె ననుచు నగుదురు సుమతీ.
గ,న, డ లు పునరాృతము అవుచున్నవి.

ఉదా:

అడిగెదనని కడువడిఁజని
యడిగినఁదన మగడు నుడువడని నెడ యుడుగన్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడి నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!
(గజేంద్ర మోక్షం)

డ, న లు పునరాృతము అవుచున్నవి.
ఈ రెండు పద్యాలలో 'డ'  అనే అక్షరము పలుమార్లు వచ్చి శబ్దాలంకారాన్ని చేకూర్చింది.

ఉదా:


ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు

ఉదా:

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్కా,
ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ,
టక్కున టక్కరి పిట్టా, నిన్ను పట్టేదెట్టా? ఎట్టా?

ఉదా:

 వచనములో కూడా శబ్ధాలంకరమునకు
(అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము లో)
 అనినన్ జిటిలుండు పటపటమని బండ్లు గొరికి, యటమటంమ్మున విద్య గొనుటయుంగాక గుట గుటలు గురుతోనా యని .....
ఇందులో ట అను అక్షరము పలుమార్లు వచ్చింది.

2.ఛేకానుప్రాసం:-

అర్థ భేదం ఉన్న రెండేసి హల్లులు అవ్యవధానంగా పునరుక్తమై ఆహ్లాదాన్ని కలిగిస్తే అది ఛేకానుప్రాసం. ఛేకులంటే పండితులు అని అర్థం. ఛేకులకు ఆహ్లాదం కలిగించే అనుప్రాసం ఛేకానుప్రాసం.

ఉదా:

‘కందర్పదర్పములగు సందర దరహాస రుచులు’. ఈ లక్ష్యంలో దర్ప-దర అనే రెండేసి హల్లులు అర్థభేదంతో పునరుక్తమయ్యాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాసం.

ఉదా:

గుడిలో పూజ పూజను చేస్తున్నది.
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

సూచన: వెంట వెంటనేరావాలి.
సూచన: అర్థబేధం ఉండాలి.

3.లాటాను ప్రాసం:-

తాత్పర్య భేదం ఉన్న శబ్దాలు పునరుక్తాలై ఆహ్లాదాన్ని కలిగిస్తే అది లాటానుప్రాసం.

ఉదా: 

‘కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ’

‘కరములు’, ‘జిహ్వ’ శబ్దాలు తాత్పర్య భేదంతో పునరుక్తాలైనందువల్ల ఇది లాటానుప్రాసం.

4.యమకం:-

సమాన స్వరసహితాలైన వ్యంజనాలు అర్థభేదంతో అవ్యవహితంగా పునరుక్తాలైతే అది యమకం.

ఉదా:

 ‘మన సుభద్ర మనసు భద్రమయ్యె’
(మన సుభద్రకు మనసు భద్రమాయె)
సుభద్ర అనే అక్షరాలు అర్థభేదంతో అవ్యవహితంగా వచ్చాయి. కాబట్టి ఇది యమకం.

ఉదా:

ఓ హారిక! జోహారిక!

ఉదా:

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు
 సూచన : పదాలు వెంట వెంటనె రానక్కరలేదు.

5.ముక్తపదగ్రస్థం:-

మొదటి పాదం చివరి పదం రెండో పాదంలో మొదటి పదంగా రావడాన్ని ముక్తపదగ్రస్థం అంటారు. అంటే విడిచిన పదాన్ని గ్రహించడం అని అర్థం.

ఉదా:

‘సుదతీ నూతన మదనా మదనా గతురంగ పూర్ణ మణిమయసదనా’

మొదటి పాదం చివర ఉన్న ‘మదనా’ పదం రెండోపాదం మొదటిపదంగా వచ్చింది. అందువల్ల ఇది ముక్తపదగ్రస్థం.

6.అంత్యానుప్రాసం:-

 ప్రతి పాదం చివరన ఒకే అక్షరం లేదా పదం రావడాన్ని అంత్యాను ప్రాసం అంటారు.

ఉదా:  

అగ్గిపుల్ల
కుక్కపిల్ల
సబ్బుబిళ్ళ
కాదేది కవితకనర్హం
ఔనౌను శిల్పమనర్ఘం

ఉదా:

ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

ఉదా:


కమనీయ శుభగాత్రు - కంజాత దళనేత్రు
వసుధాకళత్రు - పావన చరిత్రు

‘త్రు’ అనే అక్షరం పాదాల చివర వచ్చినందువల్ల ఇది అంత్యానుప్రాసం.

2) అర్థాలంకారాలు:-

అర్థ సౌందర్యం వల్ల కావ్య శోభను ద్విగుణీకృతం చేసేవి అర్థాలంకారాలు. అర్థం లేని శబ్ద సౌందర్యం ఆహ్లాదకరం కాదు. అర్థ ప్రధానమైన అలంకారాలు అర్థాలంకారాలు. వీటిలో ప్రధానమైనవి...


1.ఉపమాలంకారం:-

ఉపమాన, ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. 
ఇందులో       ఉపమేయం  (ప్రస్తుతం),
                   ఉపమానం (అప్రస్తుతం),

సమాన ధర్మం-(ఉపమేయ, ఉపమానాల్లో సమానంగా ఉండేది),
ఉపమావాచకం-(ఉపమేయ, ఉపమానాలకు సమాన ధర్మాన్ని సూచించేది) ఉంటాయి.

వలెన్, పోలెన్, ఎంతయున్, కైవడి, భంగి, అట్లు, అనంగ మొదలైనవి ఉపమావాచకాలు.

 పైన పేర్కొన్న నాలుగు అంశాలుంటే దాన్ని పూర్ణోపమాలంకారం అంటారు.

ఏదైనా ఒక అంశం లోపిస్తే దాన్ని  లుప్తోపమాలంకారం అంటారు.

అలంకారాల్లో ప్రసిద్ధమైంది, ప్రాచీనమైంది ఉపమాలంకారం. దీన్ని ప్రయోగించని కవులు లేరు.

ఉదా:

ఓ కృష్ణా! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగయందు మునుగుచున్నది

ఉపమేయం = కీర్తి,
ఉపమానం = హంస, ‘ఆకాశగంగయందు మునుగుట’ ఉపమేయ ఉపమానాలు రెండింటిలో ఉన్నందువల్ల ఇది సమాన ధర్మం. ఉపమావాచకంలా ఇందులో నాలుగు అంశాలున్నందువల్ల ఇది ‘పూర్ణోపమఅలంకారం’.

2.ఉత్ప్రేక్షాలంకారం:-

జాతి, గుణ, ధర్మ సామ్యం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్షాలంకారం. ఇందులో ఉపమేయ ఉపమానాలతోపాటు ఉత్ప్రేక్షవాచకం ఉంటుంది.

తలంచెదన్, ఎంచెదన్, భావించెదన్, ఊహించెదన్, అనన్ మొదలైనవి ఉత్ప్రేక్షవాచకాలు.

ఉదా:

 ‘‘ఈ చీకటినిచక్రవాక విరహాగ్ని నుండి పుట్టిన ధూమమో అని తలంతును’’

ఇందులో చీకటి ఉపమేయం, ధూమం ఉపమానం. ధూమం నల్లనిది, దృష్టిని ఆపుచేసేది. ఈ గుణసామ్యం వల్ల ఉపమేయమైన చీకటిని ఉపమానమైన ధూమంగా ఊహించారు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.

3.రూపకాలంకారం:-

ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం లేదా ఉపమేయ ఉపమానాలకు భేదం లేనట్లుగా వర్ణించడం రూపకాలంకారం. ఇందులో రూపక సమాసం కూడా ఉంటుంది.

ఉదా:

రాజుపై లతాలలనలు కుసుమాక్షతలు చల్లిరి.

ఇందులో ఉపమేయమైన లతల్లో ఉపమానమైన లలనల ధర్మం ఆరోపించారు. ఉపమేయమైన కుసుమాల్లో ఉపమానమైన అక్షతల ధర్మాన్ని ఆరోపించారు. కాబట్టి ఇది రూపకాలంకారం.

4.దృష్టాంతాలంకారము:-

రెండు వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబప్రతిబింబ భావముతో వర్ణించి చెబితే దానిని దృష్టాంతాలంకారము అని అంటారు.

ఉదా:

 “ఉప్పుకప్పురంబు” పద్యము

ఉదా:
అన్నానికి అరిటాకు - సున్నానికి తంబాకు - పుణ్యానికి స్వామిపాదం తాకు

ఉదా:

యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. 

5.అనన్వయాలంకారం:-

ఒక వస్తువు సాటి లేనిది అని చెప్పడానికి అదే వస్తువుతో పోల్చడాన్ని అనన్వయాలంకారం అంటారు.
ఇందులో ఉపమేయమే ఉపమానంగా ఉంటుంది.

ఉదా:

‘మేరునగానికి సాటి మేరునగమే.
సముద్రానికి సాటి సముద్రమే’.

ఇందులో ఉపమేయమైన మేరునగమే ఉపమానంగా ఉంది. ఉపమేయమైన సముద్రమే ఉపమానంగా ఉంది. అందువల్ల ఇది అనన్వయాలంకారం.

5.స్వభావోక్తి:-

జాతి, గుణక్రియాదులను సహజ సిద్ధంగా, మనోహరంగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు.

ఉదా:

‘ఉద్యానవనంలో జింకలు చెవులు రిక్కించి చంచల నేత్రాలతో సరోవరంలో నీళ్లు త్రాగుచున్నవి’ ఇందులో జింకల స్థితిని మనోహరంగా, సహజసిద్ధంగా వర్ణించారు. అందువల్ల ఇది స్వభావోక్తి.

6.అర్థాంతరన్యాసాలంకారం:-

 విశేషాన్ని సామాన్యంతో లేదా సామాన్యాన్ని విశేషంతో సమర్థించి వర్ణిస్తే, అది అర్థాంతరన్యాసాలంకారం.

ఉదా:

‘‘ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు.మహాత్ములకు అసాధ్యమైంది లేదు కదా'’.

ఆంజనేయుడు సముద్రాన్ని దాటడం విశేష విషయం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు అనే సామాన్య విషయంతో సమర్థించినందువల్ల ఇది అర్థాంతరన్యాస అలంకారం.

ఉదా:

పూలతో కూడిన నారకు వాసన కలిగినట్లు సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయాలు కలుగుతాయి.

పూలతో కూడిన నారకు వాసన కలగడం సామాన్య విషయం. సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయాలు కలుగుతాయి అనే విశేష విషయంతో దీన్ని సమర్థించడం వల్ల ఇది అర్థాంతరన్యాస అలంకారం.

7.అతిశయోక్తి అలంకారం:-

లోకస్థితిని మించి అతిశయించి వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం.

(గోరింతలు కొండంతలుగా చేసి చెప్పడము అతిశయోక్తి)

ఉదా:

కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఉదా:

ఆ పట్టణమందలి సౌధాలు చంద్ర మండలాన్ని తాకుచున్నవి.

 సహజస్థితిని మించి వర్ణించడం వల్ల ఇది అతిశయోక్తి.

8.శ్లేషాలంకారం:-

అనేక అర్థాలకు ఆశ్రయమైంది శ్లేషాలంకారం. చమత్కారమైన పదాల విరుపులతో అనేక అర్థాల వల్ల అహ్లాదం కలిగించేది శ్లేష.

ఉదా:

 రాజు కువల యానందకరుడు.

ఇందులో రాజు శబ్దానికి పాలకుడు, చంద్రుడు అని; ‘కువలయం’ పదానికి భూమి, కలువ అనే అర్థాలున్నాయి.

రాజు భూ ప్రజలకు సుపరిపాలనతో ఆనందం కలిగించేవాడని ఒక అర్థం.

చంద్రుడు కలువలను వికసింపజేసి ఆనందం కలిగించే వాడని మరో అర్థం ఉన్నందువల్ల ఇది శ్లేషాలంకారం.

9.సమాసోక్తి అలంకారం:-

ప్రస్తుత వర్ణన వల్ల అప్రస్తుత విషయం స్ఫురిస్తే అది సమాసోక్తి అలంకారం.

ఉదా:

చంద్రుడు రక్తుడై ఐంద్రీముఖమును ముద్దిడుచున్నాడు. ప్రస్తుత వర్ణన వల్ల పరకాంతా చుంబనాభిలాషియైన‌ కాముకుడు స్ఫురిస్తున్నందువల్ల ఇది సమాసోక్తి అలంకారం.

10.దీపకాలంకారం:-

ఉపమేయ ఉపమా నాలకు (ప్రకృత, అప్రకృతాలకు) సాధారణ ధర్మంతో ఒకే అన్వయాన్ని కలిగిస్తే అది దీపకాలంకారం.

ఉదా:

‘‘బ్రహ్మ రాత , విష్ణు చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం, పండిత వాక్యం వ్యర్థం కాబోవు’’

పండిత వాక్యం వ్యర్థం కాదు అనే ఉపమేయంతో బ్రహ్మ రాత, విష్ణు చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం లాంటి ఉపమే యాలను అన్వయించి చెప్పారు. అందువల్ల ఇది దీపకాలంకారం.
       

 ప్రశ్నలు-జవాబులు:-           

 1. అలంకారాలకు రాజు ఏది?

 జ )  ఉపమాలంకారం 

2. మా లోపమా అంటే ఏమిటి?

 జ ) ఒక ఉపమేయానికి 2 లేదా 3 ఉపమానాలు             చెప్పినట్లైతే అది మాలోపమ అవుతుంది.

3. లుప్తోపమ అంటే ఏమిటి?

 జ ) ఉపమాలంకారంలో 4 అంశాలుంటాయి. 

అవి :
1.ఉపమేయం
2.ఉపమానం 
3.ఉపమావాచకం 
4.సమాన ధర్మం
 
పై నాలుగు అంశాలలో ఏ ఒక్కటి లోపించినా అది లుప్తోపమ. 

4. చంద్రాలోకమును సంస్కృతంలో రచించింది ఎవరు?

 జ )  జయదేవుడు 

5. ఉపమాలంకారం లో ఒక ధర్మం లోపిస్తే దాన్ని ఏమంటారు?

 జ ) వాచక లుప్త, ధర్మ లుప్త, ఉపమాన లుప్త 

6. ఉపమాలంకారం లో రెండు ధర్మాలు లోపిస్తే దాన్ని ఏమంటారు?

 జ ) ధర్మ వాచక లుప్త , వాచకోపమేయ లుప్త , 
వాచక ఉపమాన లుప్త , ధర్మోపమాన లుప్త 

7. ఉపమాలంకారం లో మూడు ధర్మాలు లోపిస్తే దాన్ని ఏమంటారు?

 జ ) ధర్మోపమాన వాచక లుప్త 

8. పోలిక ప్రధానంగా కలిగిన అలంకారం ఏది? 

 జ ) ఉపమాలంకారం 

9. ఉపమాలంకారాలకు ప్రసిద్ధమైనసంస్కృత కవి ఎవరు?

 జ ) కాళిదాసు 

10. ఉపమేయానికి గల పర్యాయ పదాలు ఏవి?
 
 జ ) ప్రకృతం, వర్ణ్యం, విషయం

1 కామెంట్‌:

  1. ఛేకాను ప్రాసలో :గుడిలో పూజ పూజను చేసింది..దీనిలో హల్లుల జంట అవ్యవధానంగా అర్థభేదంతో పునరావృతమయ్యింది...సరే...
    మిగతా ఉదాహరణలు సరియైన?

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.