మాతృభాషా బోధన చట్టాలు/ mathrubhasha,mother toungue,teaching laws

             *మాతృభాషా బోధన చట్టాలు*

                     
 ఇంగ్లీషు మీడియమే అన్ని పాఠశాలలలో అమలు చేయబోతున్న నేపథ్యంలో ఈ అంశంపై వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. 
సమకాలీన పరిస్థితులు, వాటి ప్రభావాల వల్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. రాజ్యాంగ పరంగా , రాజ్యంగ స్ఫూర్తితో ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలు ఈ విషయమై ఏమి చెబుతున్నాయనేది కూడా ఈ సందర్భంలో పరిశీలించాల్సిన అంశం.

భారత రాజ్యాంగం ఆర్టికల్- 21 ప్రకారం రాజ్యం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు గల బాల బాలికలకు నిర్భంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలుపుతుంది.

రాజ్యంగంలోని పదిహేడవ భాగం మొత్తం అధికార భాషా సంబంధిత అంశాలను వివరిస్తుంది. 
ఇందులో..
ఆర్టికల్ 343, 344 లలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం 15 సంవత్సరాలు ఇంగ్లీషు అధికారిక భాషగా కొనసాగుతుంది. ఈ క్రమంలొనే అధికారికభాష సంఘం నెలకొల్పి హిందీని అధికార భాషగా ఉపయోగించడానికి సిఫారసులు చేయడం, ఇంగ్లీషు భాషా వినియోగం తగ్గించాలని తెలుపుతుంది.

ఆర్టికల్- 350 ప్రజలు తమ కేంద్ర రాష్ట్ర అధికారుల ముందు తమ సంతాపాలు, బాధలు  భాషలోనైనా రాసి ఇవ్వవచ్చని ఉంది.

350- (ఎ) ప్రకారం బాలబాలికలలకు ప్రతిరాష్టంలోను  ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అందదచేయడానికి అవరమైన చర్యలను చేపట్టాలి.

350- (బి) ప్రకారం రాష్ట్రపతి భాషా మైనారిటీ లపై అధ్యయనానికి ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ఈ ప్రత్యేక అధికారి రాజ్యాంగ ప్రకారం మైనారిటీల భాష అభివృద్ధికి అందించవలసిన రక్షణలు సరిగా అందుతున్నాయో లేదో సరిచూస్తుంది.

అల్పసంఖ్యాక వర్గాల భాషగురించి రాజ్యాంగం లోని ..
ఆర్టికల్ 29(1) ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న పౌరులు ఏ వర్గంలో వారైనా వారి విశిష్ట భాష, లిపి లేదా సంస్కృతి ఉన్నట్లయితే దానిని కాపాడుకొనే హక్కు వారికుంటుంది.

ఆర్టికల్ 30(1), (2) ప్రకారం భాషపరమైన అల్పసంఖ్యాక వర్గీయులు తమకు నచ్చినవిధంగా విద్యాసంస్థలు నెలకొల్పుకొని నిర్వహించుకోవచ్చు. ఆ విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం విషయంలో రాజ్యం వివక్ష చూపరాదు అని తెలియచేస్తుంది.

రాజ్యాంగంలోని పై మొత్తం అంశాలను బట్టి ప్రాథమిక విద్య అంటే  ఎనిమిదోవ తరగతి వరకు మాతృభాషలో విద్యపొందే హక్కు కల్పిస్తుంది. అల్ప సంఖ్యాక భాషల హక్కులను సంరక్షణ కోసం రాష్ట్రపతి చర్యలు కూడా తీసుకోవచ్చని తెలియచేస్తుంది. జాతీయభాషగా ఇంగ్లీషును తగ్గించి హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలని వివరిస్తుంది. 


విద్య  ఉమ్మడి జాబితాలో ఉంది. ఎవరు చట్టం చేయాలన్నా రాజ్యాంగ మౌళిక లక్ష్యాలకనుగుణంగా ఉండాలి. ఇది భావోద్వేగాలకో, జనాభిప్రాయానికో పరిమితమైన అంశంకాదు. ఏ మార్పులు చేయాలన్నా రాజ్యాంగ సవరణ తప్పని సరి అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్, జి.ఓ యస్ నెం :1188 - 10మే 1996 ప్రకారం, సెక్షన్ 48  మీడియం ఇన్‌స్ట్రక్షన్ లో మాతృభాషలో విద్యాబోధన చేయాలి. అల్ప సంఖ్యాక భాష వారు కనీసం పదిమంది ఉంటే సమాంతరంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలని తెలియచేస్తుంది.

ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం( యాక్ట్ నెం 35/ 2009) సెక్షన్ 29(యఫ్) ప్రకారం విద్యార్థుల మాతృభాషలో బోధన ఉండాలని తెలియచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొన్న ఇంగ్లీషు మాధ్యమ నిర్ణయం ఇక్కడి అధిక సంఖ్యాకులైన  తెలుగుభాష పరిస్థితి సమస్యనెదుర్కొనేలా చేస్తుంది. అల్పసంఖ్యాక భాషలు ఇంక లెక్కలో కూడా ఉండదు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి నచ్చిన ధోరణిలో వాళ్ళు భాషల విషయంగా నిర్ణయాలు తీసుకొంటూ వెళితే అనేక భాషలతో కూడిన, సమాఖ్య వ్యవస్థగా సాగుతున్న భారతదేశంలో ఉత్తరోత్తర సంక్లిష్ట సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ విషయంగా రాజ్యాంగంలో అనేక జాగ్రత్తలు తీసుకొన్నారు.

 ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళం, కన్నడ, ఒరియా, ఉర్దూ తదితర భాషామాధ్యమాలలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాలలు నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రలలో అనేక తెలుగు పాఠశాలలు కూడా నడుస్తున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో మాతృభాషలో ఆయా వర్గాలు చదువుకోవడాన్ని నిరాకరిస్తే రేపు ఆయా రాష్టాలలోని తెలుగువారు కూడా తెలుగు మాధ్యమంలో చదువుకొనే హక్కు నిరాకరించబడే పరిస్థితులు ఎదురవుతాయి.  ఇక్కడ ఇంగ్లీషు ప్రధానమైనట్లే అక్కడ వారికి నచ్చిన ఇంకో భాషలో చదవమని నిర్బంధం చేయవచ్చు. ఈ పరిణామాల కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.  ఈ దేశంలో ఇప్పటికి ఉన్నసమస్యలే కాకుండా భాషపరమైన సమస్యలు కూడా అధికమవుతాయి.

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి ఉల్లంఘనలు దృష్టిలో ఉంచుకొనే నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ఒకటి నుండి ఎనిమిది వరకు మాతృభాషలో విద్యావిధానం అమలుకు కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. దేశవ్యాప్తంగా త్రిభాష సూత్రం అమలుచేసి ఒకే విధానం అమలు జరుగుతోంది. 

ప్రథమభాషగా మాతృభాష, ద్వితియభాషగా జాతీయభాష, తృతీయ భాషగా ఇంగ్లీషు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉంది. మాద్యమ భాగా మాతృభాష ఇన్నాళ్ళు సాగింది. గత రెండు దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో వ్యాపారధోరణిలో ప్రవేశించిన ప్రయివేటు పాఠశాలలకు రాజ్యంగ విరుద్ధంగా ఇంగ్లీషు మీడియంలో అనుమతులిచ్చారు. అది తీవ్ర స్థాయికి చేరింది. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలనే ఇంగ్లీషు మీడియంలో కొనసాగే వరకు వచ్చింది. సమస్య ప్రారంబమైన చోట పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా, ఆ సమస్యలో ఒక పక్షంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావడం అసమంజసంగా అనిపిస్తుంది.

  విద్య లక్ష్యం విద్యార్థి సమగ్రాభివృద్దే తప్ప కేవలం ఉపాధి యంత్రం కాదు. విద్య ఉపాధి అవకాశాలకు ఆధారమని ప్రయివేటు పాఠశాలలు, తల్లిదండ్రులు భావించవచ్చు. అందుకోసం ఏ నిర్ణయమైన అనుసరిస్తామంటే ప్రస్తుత భారత రాజ్యంగం మాత్రం అందుకు అనుమతించదు. 

ఇంగ్లీషు మీడియం అవసరం అని భావిస్తే దేశమంతా దానిపై చర్చజరగాలి.మిగతా రాష్ట్రాల ఆలోచనలు వినాలి. ప్రాథమిక స్థాయి మాధ్యమభాషపై సంబంధిత నిపుణులతో అధ్యయనం చేయించాలి. రాజ్యంగంలో ఆర్టికల్ 350(ఎ, బి) లకు సవరణలు జరగాలి. అప్పటిదాకా ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలలో ప్రాథమిక విద్య మాతృభాషలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. చట్టాలలోని లొసుగుల ఆధారంగా ప్రయివేటు పాఠశాలలకు ఇంగ్లీషు మీడియం అనుమతులను ఇవ్వడాన్ని అరికట్టాలి. ఇచ్చిన అనుమతులను రద్దుచేయాలి.

తృతీయ భాషగా ,ఒక సబ్జెక్టు గా ఉన్న ఇంగ్లీషును ఎలా ఆధునిక పరిస్థితులకు తగ్గట్టుగా మెరుగుపరుచుకోవాలో ఆలోచించాలి.  ఎనిమిది సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ గా ఇంగ్లీషును శాస్త్రీయంగా అవసరమైనంత నేర్చుకోవడం పై దృష్టి పెడదాం. 

 ఒక సబ్జెక్ట్ గా ఇంగ్లీష్ ను చదివి ఆ భాషలో నైపుణ్యం తోపాటు, వివిధ రంగాలలో గొప్పస్థాయికి ఎదిగినవారు మన కళ్ళముందు చాలా మంది ఉన్నారు. పూర్తిగా ఇంగ్లీషు మీడియంలో చదివిన వేలాదిమంది నిరుద్యోగులు కూడా మనకళ్ళముందే ఉన్నారు. మాతృభాషతో జీవిద్దాం. అవసరమైనంత ఆంగ్లం వినియోగిద్దాం.

8 కామెంట్‌లు:


  1. మరీ సీరియస్ టపా గా వుందే :)
    ఇంత అధికారపు మేటరు గల టపాలు తెలుగు బ్లాగు లోకం లో చాలా అరుదు :)

    జిలేబి
    చాలా

    రిప్లయితొలగించండి
  2. తెలుగు లోకానికి అరుదు కాదేమో...కదా!అది అరిగిపోకుండా తిరిగి తెలుగును తెల్పేలా చైతన్య పరచడమే ఈ టపా.

    రిప్లయితొలగించండి
  3. బ్రహ్మాండం. ఇటువంటి టపాలు కావాలి తెలుగు బ్లాగులోకం గౌరవం కాపాడటానికి.

    రిప్లయితొలగించండి
  4. టపాలు అన్ని కలిసి టపాసులు కాల్చే ధ్వనికి భాషలోని శబ్దధ్వనులు వినిపించాలి...మీ టపా మాటకు ధన్యవాదాలు🙏.

    రిప్లయితొలగించండి
  5. "ఇంగ్లీషు మీడియమే *అన్ని పాఠశాలలలో* అమలు" అన్న వాక్యం తప్పు. దయచేసి దీన్ని "ఇంగ్లీషు మీడియమే *ప్రభుత్వ పాఠశాలలలో* అమలు" అని సవరించుకోగలరు.

    వెంకయ్య నాయుడు, రామోజీ రావు, పవన్ కళ్యాణ్, నారాయణ, చైతన్య రాజు వగైరాలు ఎంచక్కా తమకు నచ్చిన మాధ్యమంలో ప్రయివేటు బళ్ళు నడిపించవచ్చును: ఇందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇటువంటి "భాషాభిమానులు" ఈ సదుపాయాన్ని వాడి తమ "సొంత" పిల్లలను తెలుగులో చదివించి దేశాన్ని ఉద్దరించాలని నా బోంట్ల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!

    మాడపాటి హనుమంతరావు *సొంత డబ్బుతో* తెలుగు బడి స్థాపించి *సొంత కుటుంబీకులను* అందులో చదివించాడు. వెంకయ్య నాయుడు *మంది డబ్బుతో* కట్టిన తెలుగు బడులలో *మంది పిల్లలను* చదివిస్తే నిరంతర పాలేర్ల సరఫరా కోసం తహతహలాడుతున్నాడు.

    ఆర్టికల్ 21-ఏ (21 కాదు) 2002లో చేసిన రాజ్యాంగం 86వ సవరణ. ఇందులో నిర్బంధ ఉచిత విద్య గురించి *మాత్రమే* చెప్పబడింది. ఇందులో బోధనా మాధ్యమం గురించి ఏమీ నిర్దేశనలు లేవు.

    "The State shall provide *free and compulsory education* to all children of the age of six to fourteen years in such manner as the State may, by law, determine"

    ఇందుట్లో కీవర్డ్ "in such manner as the State may, by law, determine" అని గమనించ మనవి. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ లక్షలాది మందిని కలిసి వారి కోరికలను తెలుసుకున్నారు. కార్పొ"రేటు" బడుల దారుణ దోపిడీ సుంకాలను చెల్లించుకునే స్తోమతు లేదు కనుక మా పిల్లలకు ఇంగిలీషు చదువులు చదివే అవకాశం లేకుండా పోయిందని తల్లితండ్రుల మోర ఆలకించిన జననేత అధికారంలో రాగానే వారికా అవకాశం కల్పించారు. GoAP has "determined the manner" of imparting said free education based on people's representations. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే గీటురాయి లేదు.

    ఆర్టికల్ 350 కేవలం భాషా పరమయిన అల్పసంఖ్యాకుల గురించి. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారికి ఇది ఎలా వర్తిస్తుందో నా మట్టిబుర్రకు అర్ధం కాలేదు.

    "విద్య ఉమ్మడి జాబితాలో ఉంది"

    నిజమే కానీ కేంద్రం ఆజమాయిషీ కేంద్రీయ విద్యాలయ లాంటి *తమ* విద్యాసంస్థల మీదే.

    "దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి ఉల్లంఘనలు దృష్టిలో ఉంచుకొనే నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ఒకటి నుండి ఎనిమిది వరకు మాతృభాషలో విద్యావిధానం అమలుకు కేంద్రం చర్యలు తీసుకోబోతోంది"

    ముందు ఇవి ఉల్లంఘనలు కావు. పైగా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి లేదు. సెంట్రల్ స్కూల్స్ స్థానిక భాష మాధ్యమంలో నడిపించదలిచితే రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పలేదు.

    టపాలో ప్రస్తావించిన మిగిలిన రాజ్యాంగ అంశాలు (343, 344, 250, 29, 30) ఎవిటికీ చర్చావిషయం పై ఇసుమంతయినా సంబంధం లేదు. వీటిని పనికట్టుకు అతికించడం ద్వారా మసి పూసి మారేడు కాయ చేయాలన్న తాపత్రయం తప్ప ఇంకేమిటీ అనిపించడం లేదు.

    రిప్లయితొలగించండి
  6. మీ భాషాంతరీకరణ సరియైనదే.కానీ భావాంతరీకరణ కాదు అజ్ఞాతుడా!(పేరు తెల్పని వ్యక్తి సుమా... జ్ఞానం లేని కాదు).వాక్యంలో కర్త కర్మ క్రియ ఉన్నట్లు నా రాతలోను ఉన్నాయి అని.నేను తెలుగులో ఖర్మగా కాదు కర్మగా(పనిగా)చదువుతున్నాను. కారణం-కరణం అన్న మాటలకు అర్ధము చెప్పక్కరలేదుగా.మీ సూచనకు ధన్యోస్మి...ధన్యవాదాలు చైతన్య

    రిప్లయితొలగించండి
  7. జై గారు 1 నుండి 8 వరకు అని కేంద్రం అంటే మనం మొదటి నుండి మొదలుపెడుతున్నాముగా. మిరన్నట్టు నాకు కూడా అన్ని (అవన్నియు) చదివి కూడా సరఫరా లేక-కాలేక ఎంత మందోలే...రాజ్యాలు -రాజ్యాంగాలు అన్ని ఉన్నట్లు ఉంటాయా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చైతన్య గారూ, ఎవరి jurisdiction వారిదే. రాష్ట్ర పరిధిలో కేంద్రం, కేంద్ర పరిధిలో రాష్ట్రాలు తల దూర్చలేవు. Each is supreme in its own sphere.

      కేశవానంద భారతి తీర్పు ప్రకారం distribution of powers అన్నది మన సంవిధాన మూల వృత్తాంతం (basic structure). దాన్ని మార్చడం రాజ్యాంగ సవరణ చేసినా కుదరదు.

      రాష్ట్రపతి పాలన విధించి (బొమ్మై తీర్పు అది కూడా అంత వీజీ కాదు) చట్టాన్ని రుద్దినా అది ముగిసాక మళ్ళీ మార్చుకొనే సదుపాయం ఉంది.

      కనీవినీ ఎరగని మెజారిటీతో 151 సీట్లతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కెలికితే వారికే ప్రమాదమన్న విషయం మోడీకి తెలిసినా వెంకయ్య నాయుడు ఉండబట్టలేక ఆస్థాన పత్రికలో ఏదో రాసుకున్నాడు.

      తొలగించండి

Blogger ఆధారితం.