నా చిట్టీ చేతులు/Naa chitti chethulu song

 చిట్టి చేతులు - యాదగిరి


నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో
నా సంకలో మేడితో సాలిరువాలు దున్నినానయ్యో    
                                                                  || నా చిట్టీ||




నను  గన్నవాళ్ళకు ఏడేళ్ళప్పుడు దూరమయ్యానే
దొర గారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యానే
మూడు మూరల కర్రతో ముప్పది ఎడ్లతో స్నేహం నాదయ్యో
దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముళ్ళయ్యో
                                                                  
|| నా చిట్టీ||

  వెలుగులు బోయి చీకటి వస్తే ఇంటికి పోతానే
 మా అమ్మా అయ్యా రాకముందే నిదురపోతానే
 సుక్కబొడిసిన జాముకు ఎడ్ల కొట్టం సూరుకాడుంట 
 తెల్ల ఎల్గులు జిమ్మేటప్పుడు నీళ్ళబావికాడుంట
                                                                    
|| నా చిట్టీ||

బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్యబెడుతుంటే 
 తేపతేపకు దొరసాని రోకటి పోటుల మాటలంటుంటే
అయ్య చేసిన అప్పుల ఊబిలో నేను చిక్కుకున్నానే
ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే
                                                                    
|| నా చిట్టీ||

వాళ్ళ ఎడ్లకు ఉలవాపిండి పెట్టి ముద్దుగ జూస్తారే
కడుపు కాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతారే
చిన్నవంటికి చిల్లులు పడ్డా చొక్కా ఒక్కటున్నాదే
వాళ్ళ బిడ్డల వంటికి రంగు బట్టలు రోజు మారేనే
                                                                    
|| నా చిట్టీ||

 పెద్దోళ్ళా బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం
 నే చేసే పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో వికారం
చదువు సందెకు దూరం చేసి దొరకాడుంచకురే
నా గుండెలమీద పుండును చేసే పనులకు పంపకురే
అమ్మా నాన్న లందరికి నే దండం పెడుతున్నా
నా బాధను గాథను ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా...
                                                                    
|| నా చిట్టీ||

రచన: యాదగిరి

గానం: తెలుగోడు_చైతన్య

గేయం: నా చిట్టీ చేతులు.  

               మీకు నా గానం నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మీ సూచనలు - సలహాలు కామెంట్స్ చేయండి... 
ధన్యవాదాలు..మీ తెలుగోడు!

1 కామెంట్‌:

Blogger ఆధారితం.