నేలమ్మా గేయం - సుద్దాల అశోక్ తేజ/nelamma song

నేలమ్మా గేయం


గేయం: నేలమ్మా 

రచన: సుద్దాల అశోక్ తేజ

గానం : తెలుగోడు_చైతన్య




నేలమ్మ నేలమ్మ నేలమ్మా! నీకు

వేల వేల వందనాలమ్మా!


సాలేటి వాన కె తుళ్ళింత ఇంక

సాలు సాలుకు నువ్వు బాలెంత

గాలినే వుయ్యాలగా 

నీళ్లనే చనుబాలుగా

పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల - నువ్వు

సక్కంగ మోసేవు మొక్కల్ల

పరువమొచ్చి చేను వంగె

పైరుకాపు మేను పొంగె

పంట బిడ్డను రైతు బండికెత్తినంక

పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక.          || నేలమ్మ||


తల్లి నువ్వు నవ్వితె మాగాణి - ఎద

తలుపు తీశావంటె సింగరేణి

తనువునే తవ్వి తీసినా

పొట్టతిప్పలకు బిడ్డలు - నీ

పొట్టలో పడుతున్న తిప్పలు

ఏ రోజుకారోజు తీరి

నూరేళ్ళ ఆయుష్షు కోరి

కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు

తిరుగుతాన్నావేమొ సూర్యుని గుడిచుట్టు.          ||నేలమ్మ||


తైలాలు పూసింది నైలు నది - నీకు

తలస్నానమయింది గంగానది

గంధ మే పూసిందహో

పొందుగా హోయంగ హొ

ఖండాలలో రంగు రంగు పూలు

గండుకోయిలలు నైటింగేళ్ళు

కొలువైనదా వెండి కొండ

నీజాలి గుండెల జెండ

ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు 

కన్నుల గనలేక కపించిపోతావు.                    ||నేలమ్మ||


మా తల్లి నీ మట్టి బంగారం - అది

మానవాళి నుదుట సిందూరం

అమ్మా నీ అనురాగము

కమ్మనీ సమభావము

గొప్పలు తప్పులు చూడక - నువు

ఎప్పడు మమ్మెడ బాయక

జన్మించినా రారాజులై

పేరొందినా నిరుపేదలై

నీ ఒంటిపై సుతల చితులు కాల్చుకున్న

నీవంటి తల్లింక దేవుళ్ళకే లేదు.                      ||నేలమ్మ||



1 కామెంట్‌:

  1. అమ్మ తనువున సిరులు మొలకెత్తిస్తావు
    తనువు తొలచిన పసిడి పొంగిపోర్లిస్తావు
    మట్టని తవ్వి మొక్కనేస్తే మానై నీడనిస్తావు
    ఎన్ని చేసిన కడకు ప్రేమగా ఎద చేర్చుకుంటావు
    ఇంతన అంతన మని చెప్పను తల్లి నీ గొప్పలు

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.