సర్వర్ డౌన్ కథ/ server down lrswami

 సర్వర్‌ డౌన్‌ కథ - ఎల్‌ .ఆర్‌ .స్వామి


          నా బుర్రలో వున్న సర్వర్‌ గిర గిర తిరుగుతోంది . ఏ ఒక చోటా నిలవటం లేదు. ఆలోచనలు కల్లు తాగిన కోతిలా  గెంతుతున్నాయి. ఒక ఉదటున బ్యాంకు బయటికి వచ్చాను. పొద్దునే నాతో బయలుదేరిన సూర్యుడు ఇంకా ఆకాశ వీధిలోనే తిరుగుతున్నాడు. దేనికోసమో ఏమో! తిలియదు.



 తన పని అవకపోవడం వల్ల కాబోలూ మండి పడుతున్నాడు. సూర్యనేత్రాలు కురిపించిన నిప్పురవలు నా నెత్తి మీద పడ్డాయి. నాలోని కోపం, అసహనం కూడా బగ్గున మండింది. పక్కనే వున్న ఏ .టి .ఎం . సెంటర్‌ నీడలోకి జరిగాను. ఇప్పుడు, ఏం చేయటం -------- ?


పట్టు పోయిన అవులా నన్ను, దీనంగా చూసింది, ఏ.టి.ఏం. వెంటనే గుర్తుకొచ్చాడు గోపాల కృష్ణ. వాడికి ఫోను చేస్తే నాకే కాదు, నా మిత్రులకు కూడా ఆపద్భాందవుడే గోపాలకృష్ణ. మాకు ఏ .టి .ఎం! జీవిత సంగ్రామంలో మా రధసారధీ! మాకు గీత బోధించేది కూడా అతడే !


'ఎక్కడ వున్నావురా,బావా?' అడిగాను. వరసకు 'బావా' అని పిలిస్తాను కానీ, అతడు నా సహోద్యోగి మాత్రమే. వెంటనే పలికాడు గోపాలకృష్ణ. “ఇంటిలోనే రా, ఏమిటి సమస్య ? 'సూటిగా అడిగాడు, వాడు. అంతా మామూలుగా వుంటే ఎవరూ ఫోను చేసి పలకరించరనీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడే ఫోను చేస్తారనీ లోకజ్ఞాని అయిన అతనికి బాగా తెలుసు .



'ఏ రాచకార్యాల మీదనైనా తిరుగుతుంటా వెమోనని భయ పడ్డానురా. నీ సహాయం కావాలిరా, బావా” 'చెప్పరా',' వెంటనే, అయిదు లక్షలు కావాలి రా. 'సూటిగా విషయం చెప్పేసాను. ఓ ,అంతేనా?దానికంత కంగారు ఎందుకు ? ఈ రోజుల్లో అయిదు లక్షలు ఒక పెద్ద మొత్తమా !'' కాదనుకో, డబ్బు కాదు, బావా సమస్య. డబ్బు ఉంది'


“మరి ''బ్యాంకు వారు, క్యాష్‌ ఇవ్వడం లేదురా?' 'ఏం, ఐడెంటిటి సమస్యా? కాదు ,కాదు. ఇప్పుడు ఇవ్వలేరట సర్వర్‌  డౌన్ అట.  < వెంటనే జవాబు రాలేదు అవతల వైపు నుంచి. అందుకే నీ వద్ద క్యాష్‌ ఏమైనా ఉందేమోననీ ---? చంపేశావురా... ఈ రోజుల్లో క్యాష్‌ ఎవరు దగ్గర వుంటుందిరా !


-ఏ.టి .ఎం .లు, పే టీ యం  ములు వచ్చాకా... ఒక నిమిషం ఆగి అడిగాడు గోపాల కృష్ణ . అయినా, ఆ బ్రాంచ్‌  మేనేజర్‌ మన క్లాస్‌ మేట్ కదరా. వాడు ముఖం చూసే కదా లక్షల కొద్ది ఎఫ్‌ .డి. వేశావు, ఆ బ్యాంకులో...నిజమే అనుకో. కానీ అది వేరు, ఇది వేరు అన్నాడురా. సర్వర్‌ పని చేయని రోజు క్యాష్‌ లావాదీవులు ఎలా ?'


“నిజము ;అయినా ఇప్పుడు బ్యాంకుల్లో మానవ స్పర్శతో కూడిన లావాదీవులు ఎక్కడ జరుగుతున్నాయిలే ? పని చేసేవి యంత్రాలు  కదా? యంత్రాల బటన్‌ నోక్కే వాళ్ళు కూడా యంత్రాలే కదరా. పూర్వంలా వినియోగదారి ముఖం చూసి జరగటం లేవుగా, లావాదీవులు. తప్పుడు పత్రాలో, నిజం పత్రాలో, పత్రాలను బట్టి కదా, లావాదీవులు.


 పత్రాలు సర్వర్‌ చేతిలో వున్నాయి. ఏం చేస్తాం, చెప్పు. అసలు ఏమైందిరా ?' మీ చెల్లిని ఆసుపత్రిలో చేర్చాలిరా,వెంటనే. దుఖం ముంచుకొచ్చి నా గొంతు జీరబోయింది. అప్పుడు, సూర్యుడు, ఆకాశ వీధిలో అడుగు పెట్టలేదు. పూర్వాంబరపు తలుపులు తిసి తొంగి చూస్తున్నాడు, అంతే .


అమ్మా" అనే మా అమ్మాయి గావు కేక విని, బయట రోడ్డు చూస్తూ కూర్చున్న నేను ఉలిక్కిపడి ఇంటి లోపలకి దూకాను. వంట గది వద్ద అచేతనంగా పడివుంది, మా ఆవిడ. ఇంటి దగ్గరే వుంది పెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రి. క్షణంలో చేరాము అక్కడకి. అంగట్లో అన్నీ వున్నాయి కానీ, అల్లుడు నోట్లో శని అన్నట్లు, సదుపాయాలన్నీ వున్నాయి ఆ ఆసుపత్రిలో కానీ 'బెడ్‌' ఖాళి లేదట...


అప్పుడు మొదలైంది తిరగటం, ఆసుపత్రి కోసం. వైకుంఠ పాళీ ఆట అలాగే, ఒకందుకు లక్ష్యం చేరని ప్రయాణం! ప్రతి గడి లోనూ, నా ఆశను మింగే పామే కానీ ముందుకు తీసుకొని వెళ్ళు నిచ్చెన కనబడలేదు. ఏ ఆసుపత్రికి వెళ్లినా ఒకటే మాట.."బెడ్‌ ఖాళీ లేదు". ప్రభుత్వ ఆసుపత్రి వారి మాట కూడా అదే. కొరోనా రోజులు కదా !


సూర్యుడు కూడా నాలాగే తిరుగుతున్నాడు పొద్దుటి నీరెండ ధృడత్వం సంతరించుకుంటోంది. వెనక్కి సీట్లో అచేతనంగా పడి వుంది మా అవిడ. తన అమ్మ దగ్గర కూర్చుని వున్న మా అమ్మాయి అప్పుడప్పుడు గట్టిగా ఏడిస్తోంది. కుమిలిపోతూనే వుంది “నాన్నా, నాన్నా,  వేగం ఇంకా కొంచం వేగం' అని నన్ను తొందర పెడుతోంది.


నలభై యేళ్ళ క్రితం నాటి నా కారు పరిగెత్త లేకపోతోంది. కన్నీటి పొర నా చూపుకు అడ్డు పడుతోంది. రోడ్లు సరిగా కనబడటం లేదు .ఇంత బ్రతుకూ బ్రతికి మా ఆవిడకి చికిత్స అందించలేని అసమర్ధుడిని నేనే బాధ మనసుని తొలిచి వేస్తోంది.


హఠాత్తుగా గుర్తుకొచ్చాడు రామారావు. వాడు చిన్న నాటి స్నేహితుడు. ఇప్పుడు పెద్ద డాక్టర్‌! ఫోన్‌ నెంబర్‌ వుంది. ఫోన్‌ చేశాను... ఏమైందని అడిగాడు. కోవిడ్‌ లక్షణాలు వున్నాయా అని ప్రత్యేకంగా అడిగాడు. ఏమోరా, హఠాత్తుగా పడిపోయింది.”


ఒక నిమిషం జవాబు చెప్పలేదు రామారావు. ఆ తరువాత ఖచ్చితంగా చెప్పాడు. చాలా కష్టం రా. ఇప్పుడు అడ్మిట్‌ చేసుకోవడం చాలా కష్టం. కోవిడ్‌ రోజులు కదా.” నా కళ్లలోనుంచి కన్నీరు ఊబికింది. అలా చెప్తే ఎలాగరా? నీవే దిక్కు... నీవు ఏదో ఒకటి చేయాలి. నీకు దణ్ణం పెడతానురా"


      సర్లేరా. మా ఆసుపత్రి వాళ్ళకు చెప్తాను. అక్కడకి వెళ్ళు “థాంక్స్‌ రా" అతను అమృత కలశం అందించినట్లు తోచింది. నాకు కానీ అమృతంతో పాటు హాలాహలం కూడా వుంటుందనేది అప్పుడు గుర్తు రాలేదు నాకు. అక్కడకి వెళ్ళాక తెలిసింది, ఆ సంగతి.


ఆసుపత్రి వాళ్ళకు వాడు చెప్పాడేమో, వెళ్ళగానే, మా ఆవిడ్ని లోపలకి తీసుకొని వెళ్లారు. ఆసుపత్రి లోపల తిరిగే చల్లని గాలి నన్ను ఆప్యాయంగా తడిమింది. ఒక కుర్చీలో కూలబడ్డాను. గట్టిగా నిట్టూర్చాను. ఆసుపత్రి సిబ్బంది పిలిచాడు వెంటనే. మా ఆవిడ్ని చేర్చుకుంటామని చెప్పాడు. హాయిగా ఊపిరి పీల్చాను. 



కాని వెంటనే చెప్పాడు ఐదు లక్షలు కట్టమని. మాకు క్యాష్‌ కావాలి. చెక్కులూ వైగరాలు పని చెయ్యవు. క్యాష్‌ తెస్తే, బెడ్‌[గది] రెడీ. అలాగే. బ్యాంకులో క్యాష్‌ వుంది. వెళ్ళి తెస్తాను. ఆ లోగా.... ఆ లోగా మేం చేసేదేదీ లేదండి. అడ్మిట్ అయినట్టు కూడా కాదు. కానీ డాక్టర్‌ గారు చెప్పారు కనుక, అక్కడ వుంటారు వాళ్ళు. డబ్బు, ఎంత త్వరగా తెస్తే అంత మంచిది.


“ఇప్పుడే వచ్చేస్తాను, సార్‌. క్యాష్ డ్రా చేసుకు రావటమే. నా మాటలో పూర్తి నమ్మకం తొణికిసలాడింది. ఆలస్యమైతే బెడ్‌, ఫిల్‌ అప్‌ అయిపోవచ్చు. అప్పుడు మమ్మల్ని 'బ్లేము' చేస్తే లాభం లేదు.! నువ్వు కంగారు పడకురా. నేను చూస్తాను... నువ్వు కూడా ప్రయత్నించు" గోపాలకృష్ణ అన్నాడు. అవతల వైపునుంచి ఫోను జేబులో పెట్టుకున్నాను. బ్యాంకు లోపలకు వెళ్ళి మరోసారి అడిగాను. సర్వర్‌ పనిచేస్తోందా, అని.  లేదు... పని చేయటం లేదు.


ఏ లావాదీవీలు లేని బ్యాంకు ఊపిరి ఆడక పడివున్న కోవిడ్‌ రోగిలా కనబడింది. ప్రాణాన్ని కాపాడవలసిన వెంటిలేటర్‌ మరమ్మత్తులో వుందట! అండ దండగా వుంటానని నమ్మపలికి జీవితంలో అడుగు పెట్టిన తరువాత, బ్రతికి వుండగానే, దగాచేసిన జీవిత భాగస్వామిలా కనబడింది బ్యాంకు!


బ్యాంకు మెట్లు దిగుతూవుండే ఫోను మ్రోగింది. ఫోను మా అమ్మాయిదే. ఎక్కడ వున్నావు, నాన్నా ” దీనంగా అడిగింది అమ్మాయి బ్యాంకు వద్ద వున్నాను తల్లీ”. “తొందరగా రా నాన్నా .నాకు భయం వేస్తోంది. అమ్మ కదలటం లేదు నాన్నా”... వచ్చెస్తాను... ఆ లోగా ఏ నర్స్‌ కైనా, ఒక సారి ,చెప్పి ---"


“బతిమాలుతున్నాను, నాన్నా... చూడరట. డబ్బు కడితే కానీ చూడరంటున్నారు. ఇంత సెపైంది కదా, మీనాన్న, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయివుంటారని చెప్తున్నారు, నాన్నా. "గోళ్లుమని ఏడిచింది అమ్మాయి. నాకు కన్నీరు ఆగలేదు. ముందుకు నడిచాను. రోడ్డు దాటుతూవుంటే కిర్రుమని ఒక స్కూటర్‌ వచ్చి ఆగింది.


 ఒంటికి తగిలి తగలనట్లు ఏమిటి సార్‌, నిద్రలో నడిస్తున్నట్లు ------ ఖః ఆ గొంతు విని ఉలిక్కి పడ్డాను. బాగా పరిచయమైన గొంతే! కళ్ళు నులిపి చూశాను. స్కూటర్‌ మీద వున్నాడు ఉమ! ఉమ మంచి మిత్రుడు, సహోద్యోగి, నా జూనియర్‌...



ఏదో కంగారులో వున్నట్లు వున్నారు? ఉమ అడిగాడు, స్కూటర్‌ రోడ్డు వారకు తీస్తూ. ఏమిటి సంగతి ?” నడి రోడ్డు నుంచి రోడ్డు వారగా వున్న చెట్టు నీడ క్రిందకి కదిలాను నేను. బుర్ర కొంత చల్లబడినట్లు తోచింది. ఉమ బాగా వున్నవాడు. ఉద్యోగం కేవలం తన ప్రవృత్తి మాత్రమే అని చెప్పేవాడు. మరీ వృత్తి... మా కెందుకండి. ఈ చిన్నా చితకా ఉద్యోగాలు? మా వృత్తి వుందిగా, డబ్బు వడ్డికి తిప్పడం ॥


అయితే ఉద్యోగం మానేయి, నువ్వు మానేస్తే అవసరమున్న  ఇంకొకరికి ఉద్యోగం దొరుకుతుంది కదా! అని అనేవాడ్ని అలా అనకండి సార్‌. ఈ ఉద్యోగం వల్ల, నాకు ఎంత సుఖమో తెలుసా? ఇక్కడే వడ్డీకి తిప్పుకో వచ్చు... జీతం అందగానే,  ఇక్కడే వడ్డీ వసూలు చేయవచ్చు."


హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది మనసులో “ఇప్పుడూ ఆదేనా పని... మరీ-? పుట్టుకతో వచ్చింది పుటకలతో కానీ పోదు కదండి...అయినా, పూర్వం అంత లేదు, ఒక ఇరవై తిప్పుతున్నాను, అంతే” మళ్ళీ మ్రోగింది ఫోను. అమ్మాయే! అమ్మాయి మాటలు వినబడలేదు నాకు ; కానీ ఏడుపు మాత్రం గట్టిగా వినబడింది.



     ఆ ఏడుపు ఉమ కూడా విన్నట్టున్నాడు. ఫోను ఆపగానే అడిగాడు. "ఏమైంది సార్‌ ?' మొత్తం చెప్పాను ఏడుపు గొంతుతో. అతని కళ్ళలో కనబడిన సానుభూతి నా కళ్ళలో ఆశగా మెరిసింది. ఐదు లక్షలే ! వెంటనే !” ఉమ అన్నాడు "మామూలు రోజుల్లో ఐదు ఒక లెక్కే కాదు, నాకు. కాని , కోవిడ్‌ రోజులు కదా. వడ్డీ వసూలవటం కష్టంగా వుంది. అయినా, ఇదేం అన్యాయం? వైద్యం చేయక ముందే డబ్బు.



      అన్యాయం అంటే ఎండాకాలంలోనే కదా, ఒడియాలు పెట్టి దాచుకోవాలి, శ్రావణ భాద్రపదాలకు మెల్లగా గోణి గాను రండీ సార్‌, రండీ,నాతో రండీ. ఇంట్లో ఎంతవుందో చూసి మొత్తం ఇస్తాను. ఎడారిలో, రాలిన తొలి వానకు గొంతు తడిసిన చకోరి లా ఆనందించాను నేను. కానీ అతడు రాల్చిన తొలి చినుకు దాహనికి  ఉపశమనం కలగించలేదు .


మళ్ళీ మిత్రుల ఫోను నెంబర్లు నోక్కాను. గోపాలకృష్ణ ఇంకా ఫోను చేయలేదు. ఏం చేస్తున్నాడోీ? వేరే ఏదైనా పనిలో పడి, ఈ సంగతి మరిచి పోయి వుండాడా? ఛీ ఛీ, అలా చేయడు గోపాలకృష్ణ. ఎవరి పనైనా తన పనిగానే భావించి పూర్తి చేస్తాడు. ఫోను మ్రోగింది. గోపాలకృష్ణ కాదు, అమ్మాయి!


    ఎక్కడ వున్నావు నాన్నా, డబ్బు కట్టలేదు కనుక అమ్మని తీసుకెళ్ళి పొమ్మంటున్నారు నాన్నా" వచ్చేస్తున్నాను, తల్లీ. డబ్బు తెస్తున్నానని, చెప్పు. నేను రామరావుకి ఫోను చేసి చెప్తానులే" రామరావు ఫోనే కాదు, మిగతా డబ్బులు కూడా గగన కుసుమాలయాయి.


          నాకు పిచ్చెక్కుతున్నట్లు తోచింది. జుట్టు పీకుకున్నాను. ఒళ్ళు మండుతోంది ఎండకి, కడుపు మండుతోంది, ఆకలికి... నైరాశ్యం మండుతోంది, దిక్కు తోచక. లోక బాంధవుడైన సూర్యుడు కూడా అసలు కనికరం చూపడం లేదు. అందుబాటులోవున్న మిత్రులకందరికీ ఫోను చేశాను. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పాపం! నా లాగే, మధ్య తరగతి మనుషులు కదా, వాళ్ళు కూడా.


     హఠాత్తుగా సెల్‌ ఫోను గుండెలో వెలుగు, ఒక చలనం. ఫోను ఎత్తాను. గోపాలకృష్ణ ! ఒరేయి, వెంటనే    ---కి వచ్చేయి డబ్బులూ....? అందుకేరా -ఇంచుమించు ,కావలిసినంత అందుతుందిలే వచ్చేయి ----కి నేను చెప్తానుగా ' ...'వాడు మార్వారి కాదురా ? “ఎవరైతే మనకేమిటిరా ?9మనకు డబ్బులు కావాలి, అంతేగా ”వాడి వద్ద అంటే -ఏం చేశావురా--?'



             చిన్నచితక నగలు ఏవో వున్నాయి కాదురా,మా ఆవిడకి. అవి తెచ్చాను. ఇప్పుడు బంగారం ధర కొండ ఎక్కి కూర్చుంది కదరా " చాలా మామూలుగా అన్నాడు గోపాలకృష్ణ. అయినా మనలాంటి వాళ్లకు అవసరానికే కదా ఆభరణాలు” అవును !ఆ పని నేనూ చేసి వుండవచ్చు కదా !


క్షణంలో ఇల్లు చేరాను. మా ఆవిడ నగలుతో మార్వారి ఇల్లు చేరాను. మొత్తం అంతా తాకటు పెట్టాం కావాలిసిన దానికంటే కొంత ఎక్కువే అందింది. సూర్యుడు చల్లబడుతున్నాడు. ఆసుపత్రి చేరుకున్నాము .మా ఆవిడ, అమ్మాయి, పొద్దున వున్న చోట కనబడలేదు.



డబ్బు తీసాను... క్యాషిర్‌ కి ఇవ్వడానికి.... “ఇంత ఆలస్యమా?' బృకుటి ముడిచి అడిగాడు, అతడు ఏం చేస్తాం సార్‌ క్యాష్‌ కావాలన్నారు కదా బ్యాంకులో 'సర్వర్‌ డౌన్' సార్‌. క్యాష్‌ పోగేసేసరికి - “ఆవిడ సర్వర్‌ డౌన్‌, సర్‌. ఇప్పుడు డబ్బు ఎందుకు? అతడు అన్నాడు. నా కళ్ళు గిర గిర తిరిగాయి. చేతిలోని డబ్బు నేల మీదకి జారింది .


దూరంగా ఎక్కడ నించో, లీలగా వినబడింది... అమ్మా,...అమ్మ...అనే మా అమ్మాయి ఏడుపు. ప్రత్యామ్నూయం లేని సాంకేతికత వరమా ,శాపమా -----?


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.