పరిశోధన/research

 


"ఉన్నవానిని ఉన్నట్లుగా విచారించుట వేఱు.

 అట్లెందుకున్నావని విచారించుట వేఱు".

ఉన్నవానినికున్నావని విచారించుట తత్త్వవిచారణ. ' సత్యాన్వేషణశీలంతో తార్కిక బుద్ధితో, శాస్త్రీయ పద్ధతులతో చేసే సాహిత్య వ్యాసంగమే పరిశోధన. 'అపూర్వమైన 'అనిర్ధారితమైన సాహిత్యంశాలను వెల్లడి చేయడం, నిర్మాణసూత్రాలను విశ్లేషించడం, కొత్త సమన్వయాలను ప్రతిపాదించడం 'పరిశోధన' ప్రయోజనం. శ్రద్ధ, ఆసక్తి, నేపథ్య పరిజ్ఞానం, అన్వయ సామర్ధ్యం, వ్యుత్పన్నశీలత పరిశోధనకు ఉండవలసిన అర్హతలు. దానికి సంబంధించిన అవసరమైన ఆకరాలు కావలసిన సామాగ్రి.


Research అన్న ఆంగ్లపదానికి సమానార్థకంగా పరిశోధన అన్న పదం స్థిరపడింది. ఇది భావార్థకమైన అనువాదమే. పునశ్శోధనం, పునర్జన్వేషణం అని కొందరి భావం. కాని అది సరియైన అనువాదం కాదు. మనకు Research చేయడం ఆంగ్ల సమాజ సంస్పర్శనం వల్ల సిద్ధించిందేమో కానీ 'పరిశోధన' చేయడం మాత్రం లేకపోలేదు. 'పరిశోధించు' అంటే వెతుకుట అన్న అర్థంలో మొదటినుండి వాడుతున్నదే. 'శోధించు' క్రియముందు 'పరి' ఉపసర్గగా చేరింది. మామిడి వేంకటార్యుని నిఘంటువులో శోధన పదానికి రెండు అర్థాలున్నాయి. 1. ధాతూనామ్ నిర్దోషీకరణే - తామ్రది ధాతువుల్ని శుద్ధి చేయడం అని ఉంది. ఈ అర్థం మన రంగానికిసంబంధించింది కాదు. ఆయుర్వేద సంబంధి. 2. లిఖితపత్రాదేః ప్రమాణీకరణే అంటే వ్రాతలోని తప్పుల్ని సవరించటం, పరిష్కరించటం అన్నమాట. ఇది Research లో ఒక ముఖ్యభాగమైన Textual Criticism ను ప్రతిఫలిస్తుంది.


మోనియర్ విలియమ్స్ 'శోధ' 'శోధన'లకు వైద్యానికి సంబంధించిన Purification తో పాటు Correction, Setting Right అని అర్థాలు ఉన్నాయి. Detailed and Careful investigation into some subject or area of study with the aims of discovering and applying new facts or information అని 21వ శతాబ్ది చాంబర్స్ డిక్షనరీ నిర్వచిస్తుంది.


ఆక్స్ఫర్డ్ థెసారస్ రిసర్చిలో ఉండే వివిధ దశలను పేర్కొంది. 1. Investigation 2. Experimentation 3. Factfinding 4. Testing 5. Exploration 5. Analysis 6. Examination 7. Scrutiny 8. Assessment 9. Study 10. Review. ఏ సిద్ధాంత గ్రంథంలో నైనా ఇవన్నీ ఉండాల్సిందే. 'శోధన' అన్న నామవాచకం కన్నా 'శోధించు' అన్న క్రియ ఎక్కువగా కవుల వాడుకలో ఉన్నట్లు బొడ్డుపల్లి పురుషోత్తంగారి క్రోడీకరణంలో తేలుతుంది.


ఎ) మానుగ శోధింప వలయు మానవపతికిన్ (భారతం, ఆదిపర్వం VI-108) బి) దాని నిమ్ముగ శోధించి యెఱింగి యుండునంత (ఆదిపర్వం VI-158) సి) గణాధీశ్వరుల నెల్ల కడలను శోధించి (కుమార సంభవం 11-76) డి) బహుళ క్రియ శోధించిరి (శ్రీనాథుని శివరాత్రి మాహాత్యం 1-10) ఇక్కడ అంతా వెతికి అన్న అర్థంలో ప్రయుక్తమయింది. శోధించి యేమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో (భాగవతం 8-163)శోధింపంబడే సర్వ శాస్త్రములు (భాగవతం 7-183) శాస్త్ర అధ్యయన శీలతను, పాండిత్యాన్ని ఈ భాగవత ప్రయోగద్వయం తెలుపుతుంది.

పశ్చిమ దిగ్భాగంబు పరిశోధించు అని సూర్యారాయాంధ్ర నిఘంటువు ఒక ప్రయోగాన్ని ఇచ్చింది. ఇక్కడ పరి ఉపసర్గపూర్వకమైన శోధించు ప్రయోగాన్ని గమనించవచ్చు

గాథలు త్రవ్వక మిక్కిలి

మాధురిగన్ బూర్వ సుకవి మతములు పెక్కుల్

శోధించి తెలియ జెప్పిన

సాధనముగ సకలయతులు సంజ్ఞలు కృష్ణా..

'లక్షణశిరోమణి'లో పొత్తపి వెంకటరమణకవి (క్రీ.శ. 1700) అన్న మాటల్లో పరిశోధకుని కర్తవ్యం బోధపడుతుంది గదా! పరిశోధక విద్యార్థులకు స్వీకృత అంశానికి సంబంధించిన పూర్వకృషి వివరాలను సేకరించమని పర్యవేక్షకులు పురమాయిస్తుంటారు. విద్యార్థులు వెళ్ళి భారతిలాంటి పాత పత్రికలు గాలిస్తుంటారు. ఇదంతా 'పూర్వ సుకవి మతముల్ పెక్కుల్ శోధించడమే'. తర్క అలంకారశాస్త్రాదుల్లో కనిపించే పూర్వ పక్షం చేయడం, స్వమతస్థాపనం చేయడం లాంటివి విమర్శ నైజాన్ని ప్రకటించేవే.


ఆంధ్ర గీర్వాణ కావ్యంబు లందు నధిక

శోధకుండవు సకలార్ధ సాధకుడవు 

నీవు చెప్పెడి భల్లాణ నృపుని కథ మ

హేశ్వరాంకితముగ రచియింపవలయు


నని భల్లాణచరిత్రను రాసిన పోచిరాజు వీరన (1770-1840) ను అతని మిత్రుడన్నట్లు నిడుదవోలు వెంకటరావుగారు రాశారు. అంటే పోచిరాజు వీరన ప్రప్రథమ అధికశోధకుడు అన్నమాట. ఈ విశేషణం కవులకు మృగ్యం.


నిడుదవోలు వారింకా ఎలా వివరించారో చూడండి.

'అధిక శోధన యనగా పరిశోధన. ఇదియే ఈనాడు. విశ్వవిద్యాలయములో రిసెర్చి, తొలుత తెలుగువారిలో (ప్రథమ) చారిత్రక పరిశోధకుడు కావలి వెంకట బొర్రయ్య కాగా, వీరన ప్రథమ సాహిత్య పరిశోధకుడు అని చెప్పవచ్చును. వీరిరువురు సమకాలీనులు" అధికశోధకుడు అంటే బహుగ్రంథ పఠనశీలుడు, వ్రాయసగాడు, కావ్యాల ప్రతులు రాసి ఇచ్చినవాడు అనే అర్థంలోనే కవి ప్రయోగించినట్లుగా తోస్తుంది. నిడుదవోలువారు అవసరాన్ని మించి ఊహాలు చేసి 'విశ్వవిద్యాలయములలో రెసెర్చి' కి ముడిపెట్టారనిపిస్తుంది.


'పరిశోధన' తదంతర్భాగమైన 'శోధ' శబ్దం తెలుగులోనే కాదు, హిందీలో 'శోధ్ప్రబంధ్' అనీ, కన్నడంలో 'సంశోధన' అనీ వాడుతున్నారు. సంస్కృత గ్రంథాల మీద 'పరిశోధితమ్' అని ఉంటే తమిళగ్రంథాల మీద 'పరిశోధిత్తు', 'పరిశోధిక్కప్పట్టు' అని గోచరిస్తుంది. తెలుగులో 'సిద్ధాంత గ్రంథా'లన్న వాడుక స్థిరపడింది.


విషయో విశయ మైన పూర్వపక్షస్తథోత్తరమ్

సంగతిశ్చేతి పంచాంగం శాస్త్రే ధికరణం విదు: 

అనే ఓ శ్లోకం ఎక్కడిదో కాని పరిశోధనలో జరిగే తతంగమంతా వివరిస్తుంది.

1. విషయం: ఏదైనా ఒక అంశాన్ని ప్రతిపాదించటం

2. విశయం: విశయం అంటే సంశయం అని అర్థం: (వి,సం ఉపసర్గలు)విషయప్రతిపాదనలోని శంకలు 'విశయం'.

3. పూర్వపక్షం: సంశయం (విశయం) ఆధారంగా ప్రతిపాదిత 'విషయాన్ని' సోపపత్తికంగా ఖండించటం, పూర్వపక్షం చేయడం. 

4. ఉత్తరం: పూర్వపక్షాన్ని వివేచించడం, ఫలితాల ఆధారంగా సహేతుకంగా ఖండించడం. ఖండిస్తే అది నిలువలేదన్న సంగతి తెలుస్తుంది. దానివల్ల కొత్త విషయానికి దారి దొరుకుతుంది. ఖండించడానికి, వ్యతిరేకించడానికి వీలులేనిది అయితే సక్రమమైనదన్న నిర్థారణ అవుతుంది.

5. సంగతి: ప్రతిపాదనలోని పూర్వ పక్షాలన్నీ తొలగిపోయి ప్రతిపాదితాంశం నిర్దుష్టమైన సిద్ధాంతంగా రూపొందుతుంది. 'సిద్ధాంత గ్రంథం' అని తెలుగు పరిశోధన గ్రంథాలపై రాస్తుంటాం. కదా. సిద్ధాంత మంటే పై ఐదు లక్షణాలతో కూడినదని, ఆ లక్షణాలున్న గ్రంథం కనుక సిద్ధాంత గ్రంథమని వ్యవహారం.


ఇది చదివిన పిమ్మట మణి 

యెది యేనియుఁ జదువు బుద్ధి యేలా వొడమున్ 

బదపడి గ్రంథము లన్నియు

వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్ (1-7)

అని శపథం చేసిన కాకునూరు అప్పకవి 'అప్పకవీయం' (1656)లో ఉపయుక్త గ్రంథసూచికతో సహా పరిశోధన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పోతన లాంటి ప్రసిద్ధకవినే తిరస్కరించాడు.


కీ॥శే॥ కోవెల సంపత్కుమారాచార్యుల మాటల్లోనే చెప్పాలంటే 'అప్పకవి అనేక గ్రంథాల నుంచి అనేకాంశాలను ఉటంకించాడు. ఉదాహరించాడు. తన అభిప్రాయాలకు ప్రమాణాలను ప్రదర్శించాడు. పూర్వుల అభిప్రాయాలను స్వీకరించాడు. కొన్నింటిని హేతుబద్ధంగా నిరాకరించాడు. విషయాన్ని శాస్త్రీయంగా విశ్లేషించాడు. వివిధాంశాలను వర్గీకరించాడు. మూలగ్రంథానికి సంబంధించిన మూలాలను తన ఆధారాలతో ప్రదర్శించాడు. చర్చలు నిర్వహించాడు. అయితే ఆయన అభిప్రాయాలు మొదలయిన వాటితో అనంతర లాక్షణికులు గానీ ఈనాడు మనం గానీ అన్ని సందర్భాల్లోను ఏకీభవించలేకపోవచ్చు. ఎవరి యుక్తులు వారికి ఉండవచ్చు. అయినా ఆయన పరిశోధన విధానాన్ని కాదనలేం" పరిశోధనలో జరిగే తతంగమంతా అప్పకవి సమర్ధంగా నిర్వహించినట్లేగదా!


జ్ఞానము కేవల కృప నజ్ఞానికి నుపదేశ విధి బ్రకాశము సేయం 

గా నది సకల ధరిత్రీ దానంబున కంటె నధిక తరఫలదమగున్


అని తిక్కన శాంతిపర్వంలో(4-255) ఒకే ఒక చోట చేసిన యతి ప్రయోగాన్ని అప్పకవి ఉదాహరించడం గమనిస్తే ఆయన మహాభారతాన్ని ఎంత నిశితంగా పరిశీలించి ప్రయోగాలు గుర్తుంచుకొన్నాడో తెలుస్తుంది. ఆయన పరిశోధన దక్షతకు తార్కాణం ఇది. తాళపత్రగ్రంథాలు పోయి ప్రచురిత గ్రంథాలు ఇంటింటికీ వచ్చిన ఈ రోజుల్లో తెలుగు లెక్చరర్లుగా జీతభత్యాలు తీసుకొంటున్న వారు పదవీ విరమణ చేసేలోగా ఒక్కసారైనా మహాభారతాన్ని ఆమూలాగ్రం చదువుతారా అన్నది సంశయమే. పరిశోధన స్వరూపం


'పరిశోధన తత్వం' అనేది మనకు ఉన్నప్పటికీ పరిశోధన ఒక ప్రక్రియగా ఆకృతి దాల్చి తెలుగులోకి ప్రవేశించడం ఆధునిక కాలంలోనే అంటే విశ్వవిద్యాలయాల ఆవిర్భావంతోనే జరిగింది. కొందరు విద్యార్థులకు కేవలం ఒక డిగ్రీ రావడంతో పరిశోధన ముగియవచ్చు. యూనివర్శిటీ లెక్చరర్లకు జీవనోపాధిమార్గంగా, పదోన్నతికి నిచ్చెనగా ఉపయోగపడవచ్చు. కానీ సాహితీవేత్తలకు, ఆలోచనాపరులకు, మేధావులకు వస్తుతత్వ విశేషాలను వెలికితీసే సాధనంగా, నూత్నసిద్ధాంతాలను, సూత్రీకరణలను ప్రతిపాదించే సాధనంగా పరిశోధన గోచరిస్తుంది.


 మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, నిడుదవోలు వెంకటరావు ప్రభృతులు గ్రంథపరిష్కరణం, పరిశోధనం జీవన వ్యసనంగా అది తప్ప అన్యంలేదు అన్నంత స్థాయిలో జీవించారు. ఇప్పుడు మేధావులుగా, పరిశోధకులుగా గణతికెక్కినవారు అధ్యాపకత్వాన్ని జీవికగా చేసుకుని సాహిత్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు. పత్రికల్లో తరచు వ్యాసాలు రాస్తున్నారు. ఇతర పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ గ్రంథంలో ఐదువేలమంది పరిశోధకులుగా రికార్డ్ చేయబడితే వారిలో ముప్పావుశాతం మంది కేవలం డిగ్రీ రావడంతో పరిశోధన జీవితానికి, సాహిత్యవ్యాసంగానికి స్వస్తి చెప్పినవారే.


తెలిసిన స్వల్ప ఆధారాలతో తెలియని దాని అంతర్బహిస్తత్వాలను అన్వేషిస్తు క్రమపద్ధతిలో సాగడమే పరిశోధన అని స్థూలంగా సూత్రీకరించుకొంటే ఆ చిన్ని సూత్రంలో అతి విస్తృతకార్యకలాపాలు అంతర్భూతంగా ఉన్నాయని చెప్పవచ్చు. మనమనుకున్నది మనం తెలుసుకొనేది ఒక స్పష్టమైన రీతిలో దేశకాల సాహిత్యస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఒక క్రమపద్ధతిలో ఏ? ఏమిటి? ఎందుకు? అన్న ప్రశ్నలకు తర్కసహంగా శాస్త్రీయంగా సమాధానాలు వెతకడమే పరిశోధన పరమార్థం. పరిశోధన ఒక విమర్శ దృష్టితో చేసే (సాహితీ) బౌద్ధిక ప్రక్రియ తప్ప సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం గమ్యమైంది కాదు. పరిశోధన సముద్రంలో గజ ఈతగాళ్ళుగా దూసుకొని పోవడానికీ, ఆణిముత్యాల్లాంటి నూతనాంశాల్ని వెలికి తీయడానికీ పిహెచ్.డి. బాగా శిక్షణ నిచ్చే సోపానం. 


ఆ ప్రత్యేకాంశాన్ని గురించి అవసరం వస్తే మరింత విస్తారంగా పరిశోధనలు జరపడానికి తగిన తెలివితేటలు సామర్థ్యం ఉన్నాయని గుర్తింపు తెచ్చు కోవడానికి పిహెచ్.డి. ముద్ర ఉపయోగపడుతుంది. పరిశోధన, విమర్శ, సమీక్ష పరిశోధన, విమర్శ, సమీక్ష ఒక్కోదశలో విడదీయరానంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కలిసిపోతాయి కూడా. ఒక సిద్ధాంత గ్రంథంలోనే పరిశోధకత్వం, విశేషకత్వం, సమీక్షత్వం చోటు చేసుకోవచ్చు..సత్యనిష్ఠ, తాటస్థ్యం లభ్య ఉపపత్తుల సహాయంతో సిద్ధాంత ప్రతిపాదనం చేసుకుంటూ పరిశోధన వస్తునిష్ఠంగా సాగిపోతుంది. తర్వాతి సోపానం విమర్శ. పరిశోధితాంశం లేదా ఒక అంశం పఠితలో కలిగించే అనుభూతి విశేషాన్ని గుర్తించడం, గుణాగుణ వివేచనం చేయడం విమర్శలో ప్రధానంగా జరిగే వ్యాపారం. 


శాస్త్రీయతతో పాటు విమర్శకుని అభిరుచి కూడా కావ్య విశ్లేషణలో ముఖ్యపాత్ర వహిస్తుంది. శబ్దం, అర్థం, వ్యాకరణం తెలిసినంతమాత్రాన కావ్యార్థతత్వం బోధపడదు. ఎలాంటి పూర్వ నిశ్చితాభిప్రాయాలు (Pre occupied Openions) లేకుండా నిర్మలాంతఃకరణంతో కవిభావనను స్వీకరించగలిగిన వానికే అంతరార్థాలు అవగతమవుతాయి. కావ్య బాహిరరూపమైన సాభిప్రాయ పదప్రయోగచాతుర్యం, సమాసనిర్మాణ కౌశలం, శబ్దాలంకారిక రీతి. ఆకర్షణీయ వాక్యవిన్యాసం అంతేగాక అంతర తత్వానికి చెందిన విశేషార్థస్ఫూర్తి మత్వం, హృదయాహ్లాదకరత్వం ఆలోచ నాత్మకం, చైతన్య ప్రచోదనం, గుణ ఔచిత్య రసపోషణాదులను పరిశోధకుడు విశ్లేషించుకునే సామర్థ్యాన్ని సంపాదించు కోవాలి.


 దీనికి బహుపర్యాయపఠనం, నిరంతర మననం, సాహిత్య దీక్ష, ప్రతిభా పాండిత్యాలు, శ్రద్ధాభక్తులు, లేఖన నైపుణ్యం అవసరం. సాధారణ రచయితల లౌకిక రచనల మీద చేసే పరిశోధకులకు ఈ మాత్రం ఉంటే సరిపోవచ్చు. మంత్ర తంత్ర యౌగిక పారమార్ధికాంశాలను భిన్నస్తరాలలో లౌకిక ఇతివృత్తంతో పొదిగిన ప్రాచీన సంస్కృత ఆంధ్ర మహాకవుల రచనలు (అందరు కారు సుమా! అరవిందుని సావిత్రి, మేడం బ్లావట్స్క సీక్రెట్ డాక్ట్రిన్లాంటి రచనలు సరిగ్గా బోధపడాలంటే దైవానుగ్రహం, పరమ గురువుల ఆశీస్సులుండవలసిందే. దీనినే 'పురాకృతపుణ్యం' అని వ్యవహరిస్తాం. ఇది లేకపోతే అసమగ్రంగా బోధపడి అశాంతి కలిగించడమో వికృతంగా బోధపడి అపఖ్యాతి తేవడమో జరగవచ్చు. పరిశోధనలో పలువురి దృష్టిపడని 'అంశాన్ని' దొరికించుకోగలిగే నిశితత్వానికి ప్రాముఖ్యం ఉంటే, విమర్శలో పొరలు పొరలుగా విప్పి చెప్పగలిగే సామర్థ్యానికి అగ్రతాంబూలం ఉంటుంది.


'పరిశోధన కాధారము సత్యాన్వేషణమే. ఇందు పక్షపాతమున కిసుమంతయు తావు లేదు. విమర్శకుడు వకీలు వలె పక్షపాతము చూపెట్టవచ్చును. కాని పరిశోధకుడు న్యాయనిర్ణేతవలె సత్యాన్వేషణమునకు ప్రాధాన్యమిచ్చును.' అని ప్రముఖ హిందీ విద్వాంసుడు ఆచార్య కర్ణ రాజశేషగిరిరావు గారి మాటలు స్మరణీయాలు.

Research may be defined as the systematic and objective analysis and recording of controlled observations that may lead to the development of generalizations, principles or theories, resulting in prediction and possible ultimate control of events e చెప్పిన John W. Best. మాటలను కూడ' మనం చెప్పుకోవచ్చు.

 సమీక్షా పరిధి మరింత చిన్నది. గ్రంథస్థ విషయ నివేదన మాత్రమైంది. గ్రంథపరిచయం పరమావధిగా కొనసాగేది.


ఒక సిద్ధాంత గ్రంథంలో పరిశోధనాత్మకత, విమర్శనాత్మకత సమపాళ్ళలో ఉంటే విజ్ఞులు ఆదరిస్తారు. విషయాన్ని బట్టి, ఆవశ్యకతను బట్టి కొన్నింట్లో పరిశోధనాత్మకత ఎక్కువగా ఉంటే, మరికొన్నింట్లో విమర్శకు అధికస్థానం లభిస్తుంది. సాధారణంగా ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించే సిద్ధాంత గ్రంథాల్లో ప్రథమాధ్యాయంలో పరిశోధనాత్మకత అధికంగా గోచరిస్తే తక్కిన అధ్యాయాల్లో విశ్లేషణ రూపంలో విమర్శ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెంటిని వదిలేసి కేవలం సమీక్ష మాత్రంగానో గ్రంథసారాంశ లేఖనంగా ఉంటే ఆ సిద్ధాంత గ్రంథం తేలిపోతుంది.


1. నూత్న సిద్ధాంతాలను గాని, వాదాలను గాని రూపొందించ నికి తోడ్పడటం. 

2. పూర్వ సిద్ధాంతాలను గాని, వాదాలను గాని సవరించి పరిష్కరించి అభినవదృక్పథంతో సాహిత్యాన్ని గాని, ప్రక్రియలను గాని అనుశీలించడానికి మార్గాలను ఏర్పరచడం

3. కావ్యాల విలువలను వినూత్న దృక్కోణాలతో నిర్ధారించే పద్ధతులను ప్రతిపాదించడం.

4. సాహిత్యంలోని ప్రయోగాలను ప్రక్రియలను వివిధ సాహిత్యాంశాలను విశ్లేషణాత్మకంగా వివేచించడానికి వివరించడానికి సహాయకారి కావటం. 

5. పరిశోధనలో వివిధశాఖలను ఆవిష్కరించడం" అని జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిశోధనలు సాధించే ప్రయోజనాలను సోదాహరణంగా వింగడించి చూపారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.